హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు మంజూరై రెండున్నరేండ్లు దాటినా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. నిధుల కొరతతోపాటు కోర్టు కేసులు, జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సమాయత్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని భావిస్తున్నది. అందులో భాగంగా త్వరలో కేంద్ర మంత్రితో సమావేశం కావాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ట్రిపుల్ఆర్ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ, మితిమీరిన జాప్యం వల్ల నిర్మాణ వ్యయం మరో రూ.10 వేల కోట్లు పెరిగి రూ.30 వేల కోట్లకు చేరుకున్నది. ఇందులో దాదాపు రూ.8 వేల కోట్లు భూసేకరణకే వెచ్చించాల్సి ఉన్నది. భూసేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉన్నది. ఇందులో రాష్ట్ర వాటాను చెల్లిస్తే రోడ్డు నిర్మాణం పూర్తిగా ఎన్హెచ్ఏఐ చేపట్టాల్సి ఉన్నది.
రెండు భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన ట్రిపుల్ఆర్ ప్రాజెక్టులో ఉత్తర భాగం అలైన్మెంట్ ఖరారై రెండున్నర ఏండ్లు దాటినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూసేకరణ వ్యయంలో తమ వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రుణం రూపంలో సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. రాయగిరి ప్రాంతంలో భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ మంత్రి ఇప్పటికే జాతీయ రహదారుల శాఖకు లేఖ రాశారు. దీంతో ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చడమంటే తేనెతుట్టెను కదిపినట్టేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కచోట అలైన్‌మెంట్‌ను మార్చితే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయని, కోర్టుల్లో కేసులు పడి ప్రాజెక్టు ముందుకు సాగేందుకు ఆస్కారం ఉండదని హెచ్చరిస్తున్నారు. కాగా, భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ప్యాకేజీలవారీగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాల్సిన ఎన్హెచ్ఏఐ.. ఆ పని చేయకుండా మొత్తం భూసేకరణ పూర్తయ్యాకే పనులు చేపడతామని మొండికేస్తున్నది. దీంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.
భారత్‌మాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులను మంజూరు చేసిన విషయం విదితమే. ఈ పథకం కింద మంజూరైన ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు పనులు ప్రారంభంకాని ప్రాజెక్టులపై త్వరలో సమీక్ష నిర్వహించి తదుపరి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం కూడా ఈ కోవలోనిదే కావడంతో దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉన్నది. ఇక దక్షిణ భాగం పనులకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినా ఇంకా అలైన్మెంట్ ఖరారు కాలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ముగిసేలోగా కూడా ఈ పనులను చేపట్టకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక జాతీయ రహదారులను విజయవంతంగా నిర్మించిన అనుభవం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖకు ఉన్నది. దీంతో ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తే పనులను తామే చేపట్టాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ఇటీవల తమ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో నితిన్ గడ్కరీకే మళ్లీ రహదారుల శాఖను అప్పగించిన విషయం విదితమే. ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న ఆయనతో త్వరలో మరోసారి సమావేశమై కేంద్ర నిధుల గురించి ప్రతిపాదించాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. దీనిపై మోదీ సర్కారు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.