సంబంధం ఉన్నట్టు చరిత్ర తిరగేస్తే అర్థమవుతుంది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రింగు రోడ్లకు ఒక అలైన్మెంట్ ఖరారైతే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అది నాదస్వరం ఊదితే తాచుపాములా నాట్యమాడుతుంది. ఒకచోట కిలోమీటరు జరిగితే.. ఇంకోచోట ఐదారు కిలోమీటర్ల దూరం పాకుతుంది. పాత అలైన్మెంట్లో పెద్దోళ్ల భూముల్లోంచి సాగే రింగు రోడ్డును కాంగ్రెస్ సర్కారు కమాల్ చేసి.. సన్న, చిన్నకారు రైతుల భూముల్లోకి మలుపుతుంది. నెత్తీనోరు కొట్టుకొంటూ బక్క రైతు దిక్కుతోచక చూస్తుంటాడు. చివరికి కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగి రూపాయి బదులు రూపాయిన్నర పరిహారమిస్తామని నమ్మబలికి ఉన్న జాగను గుంజుకుంటారు. పేద రైతుల భూముల్లోంచి దూసుకుపోయే విశాలమైన రింగు రోడ్డు కాస్తా పెద్దల భూములకే వన్నె తెస్తుంది. భవిష్యత్తులో వాణిజ్య సముదాయాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఇలా విశ్వ నగరాలను తలపించే ఆకాశహర్మ్యాలు ఆ భూముల్లో వెలుస్తుంటే రింగు రోడ్డుకు భూములిచ్చిన రైతులు అక్కడే ఉపాధి కోసం వెతుకులాడుకుంటారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగురోడ్డు అలైన్మెంట్ నాట్యమాడి నట్టుగానే ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు ఉరఫ్ ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ కూడా ఇదేరీతిన పెద్దోళ్ల భూముల్లోంచి మారి బక్క రైతుల భూములను చెరబట్టింది. ట్రిపుల్ఆర్ తాజా అలైన్మెంట్లో మార్పుల వెనుక.. ‘ముఖ్య’నేత సహా పలువురు కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చడమే అసలు మతలబు!!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి/వికారాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను గతేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్య’నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట వంకరలు తిప్పడాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 1-3 కిలోమీటర్ల మేర పేదల భూముల్లోకి జరిగిన అలైన్మెంట్.. వికారాబాద్ జిల్లాకొచ్చే సరికి ఐదు కిలోమీటర్ల మేర జరగడం వెనక మతలబును బహిర్గతం చేసింది. దీంతో కమిటీలంటూ కాలయాపన చేసిన ప్రభుత్వ పెద్దలు చివరకు అదే అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేస్తే క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. రెండో అలైన్‌మెంట్‌లోనూ వికారాబాద్ ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నేతల భూములపై ప్రభావం చూపుతుండటంతో ఐదు కిలోమీటర్లు జరిగిన అలైన్‌మెంట్‌ను మరో రెండు కిలోమీటర్లు అంటే ఏకంగా ఏడు కిలోమీటర్ల వరకు జరిపారు.
‘నమస్తే’ కథనాలతో కొంతకాలం కాలయాపన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ అప్పటికే ఖరారై ఉన్నది. క్షేత్రస్థాయిలో అధికారులు మార్క్ కూడా చేశారు. కానీ గతేడాది ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అలైన్మెంట్ మార్చింది. కేవలం ‘ముఖ్య’నేత బంధువులు, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతల భూములను కాపాడేందుకు ఈ మార్పు జరిగిందనేది బహిరంగ రహస్యం. ఈ మేరకు అప్పట్లోనే ‘నమస్తే తెలంగాణ’ ఈ మర్మాన్ని పలు కథనాలతో వెలుగులోకి తెచ్చింది. దీనిపై కిమ్మనని ప్రభుత్వం ఓ క్యాబినెట్ సమావేశంలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వాస్తవానికి మార్పు వెనక ఎలాంటి శాస్త్రీయ, సాంకేతిక కారణాలు లేవనేది అందరికీ తెలిసిందే. కాకపోతే అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కాలయాపన చేసేందుకు ప్రభుత్వం కమిటీని తెరపైకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో రాత్రివేళల్లో డ్రోన్ సర్వేలు చేయించి రైతుల్లో అయోమయం సృష్టించింది. కొన్నిచోట్ల ఏకంగా మూడు చోట్ల అలైన్మెంట్ మార్కులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా కొంతకాలం అయోమయాన్ని కొనసాగించి చివరికి కొన్నిరోజుల కిందట ఓ క్యాబినెట్ భేటీలో అలైన్మెంట్ ఖరారు చేసినట్టు ప్రకటించింది. ఖరారైన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగు రోడ్డుకు ట్రిపుల్ ఆర్ ఒకచోట 40 కిలోమీటర్ల దూరం నుంచి వెళితే, మరికొన్నిచోట్ల 28 కిలోమీటర్లు ఇలా ఓ పద్ధతి లేకుండా తయారైంది.
‘రింగు’ మాటున ‘బిగ్’ పాగా
కేసీఆర్ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చే ప్రక్రియలో తెర వెనుక వేలాది ఎకరాల సమీకరణ జరిగినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల పరిధిలో అలైన్మెంట్ మార్పు ‘బిగ్ బ్రదర్స్’ కనుసన్నల్లో జరిగిందనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మొదలు వికారాబాద్ జిల్లా పూడూరు వరకు అలైన్‌మెంట్‌కు అనుగుణంగా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడంతో పాటు వేలాది ఎకరాల అసైన్డ్ భూములపై పెద్ద ఎత్తున అనధికారిక ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాడ్గుల, వెల్దండ మండలాల పరిధిలోని అజలాపురం పరిధిలో ఉన్న కుందారం భూములను అనధికారిక ఒప్పందాలతో చెరబడుతున్న వైనాన్ని గతంలో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఇదేరీతిన పేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను వేలాది ఎకరాల మేర అనధికారిక ఒప్పందాలతో తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వెనక ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కోసమే అలైన్మెంట్ మార్పు చేయించామని ప్రచారం చేసుకుంటున్నా అసలు విషయం మరొకటి ఉందనే చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూములు కోల్పోతున్న కాంగ్రెస్ బడా లీడర్లు రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసేలా పావులు కదిపారనే ప్రచారం జరుగుతున్నది. ఒక్క పూడూరు మండలంలోనే 12 గ్రామాల మీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్లేలా కొత్త అలైన్మెంట్ ఖరారు చేశారు. ఇందులో అత్యధికంగా పేద రైతుల భూములే ఉండగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు మాత్రం ఈ మార్పుతో భారీ డిమాండ్ వచ్చింది. పూడూరు మండలంలోని ఎన్కెపల్లి సమీపంలో 100 ఎకరాల్లో వెలసిన మైరాన్ హోం వెంచర్‌తోపాటు డెక్కన్ ట్రయల్స్ రిసార్ట్, ఊటీ గోల్ఫ్ కౌంటీకి చెందిన భూములకు నష్టం జరగకుండా అలైన్మెంట్ మార్పులు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూడూరు గ్రామ పరిధిలోని జనప్రియ రియల్ ఎస్టేట్ వెంచర్, మంచన్‌పల్లి శివారులో వెలసిన గిరిధరి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ భూములు ఇంచు కూడా కోల్పోకుండా కొత్త అలైన్మెంట్ మార్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అలైన్మెంట్ మార్పులో సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బడా నాయకులకు ముడుపులు ముట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముచ్చటగా మూడోసారి మార్పు
వికారాబాద్ జిల్లా వైపు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తీరు మరో వింతగా తయారైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని చేవెళ్ల మండల పరిధిలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేశారు. దీని ద్వారా పలువురు నేతలు భూములు కోల్పోవాల్సి వచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలైన్‌మెంట్‌ను చేవెళ్ల మండల పరిధి నుంచి వికారాబాద్ వైపు ఏకంగా ఐదు కిలోమీటర్లు జరిపినట్టు తెలిసింది.
కొందరు నేతల భూములను కాపాడేందుకు ఈ అలైన్మెంట్ మార్చగా మారిన అలైన్మెంట్ కూడా పలువురు కాంగ్రెస్ నేతల భూముల మీదుగా వెళ్లింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఒకరి భూము లు ఉండగా ఆయనతో పాటు కాంగ్రెస్ ‘పెద్ద’ ఒకరి భూము లు, మాజీ ఎమ్మెల్యే భూములున్నాయి. మూ డోసారి అలైన్‌మెంట్‌ను వికారాబాద్ వైపు మరో రెండు కిలోమీటర్లు జరిపారు. దీంతో ఏకంగా ఏడు కిలోమీటర్లు పాకిన అలైన్మెంట్తో పలువురు అధికార పార్టీ నేతల భూములు సేఫ్‌గా మిగలడమే కాదు.. వారితో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ కలెక్టర్ భూములకు కూడా డిమాండ్ పెరిగినట్టు తెలుస్తున్నది.
ఎమ్మెల్యే వెంచర్ సేఫ్.. రైతులు బలి
ఇది నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దు లో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్. గతం లో ఇక్కడి కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్లోనే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్‌మెంట్‌ను కిలోమీటరు దూరానికి మార్చడంతో ఇప్పుడా వెంచర్ సేఫ్ కాగా, బక్క రైతుల భూములు పోతున్నాయి.
పేద రైతుల భూముల్లోకి జరిపి..
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోనూ ట్రిపుల్ ఆర్ పేద రైతుల భూముల్లోకి పాకింది. నాడు ఖానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడి నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది.
ఏకంగా ఏడు కిలోమీటర్ల దూరం
వికారాబాద్ జిల్లా వైపు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తీరు వింతగా మారింది. బీఆర్ఎస్ హయాంలో చేవెళ్ల మండల పరిధి నుంచి అలైన్మెంట్ ఖరారు చేస్తే కాంగ్రెస్ వచ్చాక దాన్ని వికారాబాద్ వైపు ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిపింది. పలువురు కాంగ్రెస్ కీలక నేతల భూములను కాపాడేందుకే ఇంత దూరం అలైన్‌మెంట్‌ను మార్చినట్టు తెలుస్తున్నది.
రింగులు తిరిగిన అలైన్మెంట్!
ఇది రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామ పరిధిలో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్. రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. ఈ భూమికి అవతల 2-3 కి.మీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది. ఎందుకంటే గతంలో మార్కు చేసిన ఈ భూమి ‘ముఖ్య’నేత అత్యంత సమీప బంధువుది. దాన్ని కాపాడేందుకు చంద్రాయణ్పల్లి, కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్న, చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది.
కేసీఆర్ ‘మార్కు’ చెరిపేయడమంటే ఇదేనా?!
ఇది రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసి ఇలా గుర్తు కూడా చేశారు. ఇది పేదరైతు భూమా? భూస్వామిదా? అనేది చూడలేదు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడినుంచి వెళ్లాల్సిన ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చింది.
ఈ భూమికి అవతల 2-3 కిలోమీటర్ల దూరంలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేసింది. ఇదేదో సాంకేతిక సమస్య కాదు. గతంలో మార్కు చేసిన ఈ భూమి ‘ముఖ్య’నేత అత్యంత సమీప బంధువుది. మాడ్గుల పరిధిలో ‘ముఖ్య’నేత బంధువులెవరో తెలంగాణ సమాజానికంతటికీ తెలుసు. ఈ భూములను కాపాడేందుకు చంద్రాయణ్పల్లి, కలకొండ తదితర గ్రామాల నుంచి అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడంతో సన్న, చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది. ఉన్న ఒకట్రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ట్రిపుల్ఆర్ కోసం తీసుకోవడంతో ఆ ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. మారిన అలైన్మెంట్తో సదరు ‘ముఖ్య’నేత బంధువుల భూములు లక్షణంగా ఉండటమే కాదు.. సమీపం నుంచే రింగు రోడ్డు వెళ్లడంతో ఈ భూముల ధర అనేక రెట్లు పెరిగింది. ఇది చాలదన్నట్టు గ్రీన్‌ఫీల్డ్ హైవే సైతం ఈ భూములకు మరో మణిహారంగా మలిచారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం పేద రైతులకు పాట్లు
ఇది కూడా నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్. సాంకేతికంగా ఇది నల్లగొండ జిల్లా కుర్మేడు గ్రామ పరిధిలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో దాదాపు 200 ఎకరాల మేర ఉన్న ఈ వెంచర్‌లోని కొన్ని ప్లాట్ల మీదుగానే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్లోనే ఉన్నారు.
అయినా సాంకేతికంగా అలైన్మెంట్ అక్కడి నుంచే ఖరారు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు సదరు నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అయ్యారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రింగు రోడ్డు అలైన్మెంట్ మారింది. ఇక్కడి నుంచి అలైన్‌మెంట్‌ను మార్చి సుమారు కిలోమీటరు దూరం అన్నెబోయినపల్లి వైపు మార్చారు. ఇంకేముంది వెంచర్ సేఫ్. కానీ బక్క రైతుల భూములు మాత్రం ఢమాల్. అసలు అలైన్మెంట్ ఎందుకు మారిందనేది ఎవరికీ అంతుచిక్కక రైతులు లబోదిబోమంటున్నారు.
బక్క రైతులపై ఎందుకీ ‘కసి’
రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల పరిధిలో కూడా అలైన్మెంట్ తాచుపాములా పేద రైతుల భూముల్లోకి పాకింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖానాపూర్ మీదుగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్నా సాంకేతికంగా అలైన్మెంట్ ఖరారు కావడంతో కేసీఆర్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది.
కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ దాదాపు కిలోమీటరు దూరం అవతలకు జరిగింది. కారణం.. అప్పటి ఎమ్మెల్సీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంతేకాదు.. గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల భూములు కూడా గత అలైన్మెంట్ మేరకు రహదారిలో పోతున్నాయి. దీంతో అలైన్‌మెంట్‌ను మార్చినట్టు స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారిన అలైన్మెంట్తో పేద రైతులు తమ భూములను నష్టపోవడం ఒకవంతైతే.. గతంలో నష్టపోవాల్సిన సదరు ఎమ్మెల్యే, వారి బంధువులు, ఇతరులకు చెందిన వందల ఎకరాల భూములకు ఇప్పుడు రింగు రోడ్డు పక్కన భూముల పేరిట భారీ డిమాండ్ వచ్చింది.