హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ గళం’ ఫేస్బుక్ పేజీలో అనుచిత పోస్టింగ్ పెట్టారనే ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుల దర్యాప్తును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకే తరహా విషయంపై ఇప్పటికే కేసులు నమోదు చేసినందున అదే తరహా కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇదే వర్తిస్తుందని చెప్పింది.
‘తెలంగాణ గళం’ ఫేస్బుక్ పేజీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోరాదని కూడా ఆదేశించింది. తెలంగాణ గళం పేజీకి సంబంధించి కొత్త కేసులు నమోదు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత మల్లు రవి, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను మార్చి 14కి వాయిదా వేశారు.