మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 25: రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం స్థాయిలో ఉండి ఒక వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలే చీదరించుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం అయిన దగ్గర నుంచి రేవంత్‌రెడ్డికి పరిపాలన చేత గాక కేసీఆర్ కుటుంబంపైన విరుచుకుపడుతున్నాడని దుయ్యబట్టారు.
రాష్ర్టానికి రావాల్సిన నీటి వాటాపైన సభలు పెడతామని కేసీఆర్ చెప్పగానే రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని, అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పే ర్కొన్నారు. ఈ నెల 27న మానుకోట జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. జిల్లాలో బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను సన్మానిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని 18 మండలాల నుంచి గెలిచిన సర్పంచ్‌లంతా హాజరు కావాలని సూచించారు.