హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మార్కుల శాతాన్ని తగ్గించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం మార్పులు చేసినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అన్ని సబ్జెక్టుల్లోనూ, స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల్లో మార్కుల శాతాన్ని తగ్గించినట్టు వెల్లడించింది. వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచినట్టు పేర్కొంది. డీఎస్సీ దరఖాస్తుకు ఈ నెల 20వరకు అవకాశం కల్పించింది.