మిర్యాలగూడ, ఆగస్టు 12: నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి తగ్గింపుతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ నిల్వ పూర్తిస్థాయికి చేరడంతో క్రస్ట్ గేట్ల ద్వారా 1.44 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కాలువల ద్వారా సాగుకు పూర్తిస్థాయిలో నీటిని వదలాల్సిన అధికారులు ఎడమకాలువకు గణనీయంగా తగ్గించారు.
మంగళవారం ఉదయం వరకు ఎడమ కాలువకు 7,518 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఉదయం 9 గంటలకు నీటి విడుదలను 3,910 క్యూసెక్కులకు తగ్గించారు. నీటి తగ్గింపు విషయమై రైతులు అధికారులను అడిగితే ఖమ్మం జిల్లా అధికారుల సూచన మేరకు తగ్గించినట్టు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నిండిందని అక్కడ వర్షాల ప్రభావం వల్ల వరద ఎక్కువగా వస్తున్నదని ఈ కారణంచేత ఎడమ కాలువకు నీటి విడుదల తగ్గించాలని ఆదేశాలు జారీ అయినట్టు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
15 రోజులుగా సాగునీటిని విడుదల చేస్తున్నా పలు మేజర్లకు చివరి భూములకు నీరు అందక రైతులు పొలాలు దమ్ము చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నాలుగు రోజులుగా స్వల్పంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదలను సగానికి తగ్గించడంతో కాలువ నీటిమట్టం పడిపోయింది.