హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్కల ప్రకారం నిరుడు ఇదే సమయానికి గల యాసంగి సాగుతో పోల్చితే ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పంటసాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నిరుడు ఇదే సమయానికి 60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా, ప్రస్తుతం ఇది 53 లక్షల ఎకరాలకే పరిమితమైది. నిరుడు యాసంగిలో రికార్డుస్థాయిలో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గత యాసంగి సాగును చేరేందుకు ప్రస్తుతం ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిన అవసరం ఉన్నది.
యాసంగిలో సాగునీళ్ల కొరత ప్రభావం వరిసాగుపై భారీగా పడింది. నాగార్జునసాగర్తోపాటు కడెం, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టుల నుంచి అవసరమైన సాగునీళ్లు అందుబాటులో లేకపోవడంతో వరిసాగు భారీగా తగ్గింది. గతంతో పోల్చితే మొత్తం సాగు 7 లక్షల ఎకరాల్లో తగ్గితే అందులో వరి సాగే ఏకంగా 6 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం. సాగర్ నీళ్లు ఇవ్వలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మొండిపట్టుదలకు పోయి కాళేశ్వరం ద్వారా నీళ్ల పంపిణీని మొత్తం బంద్ చేసింది. ఈ ప్రభావం రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాల సాగుపై పడింది. దీంతోపాటు కడెం, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకపోవడంతో పంటల సాగు అయోమయంలో పడిపోయింది.
ప్రస్తుతం గత సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నీళ్లు ఆయా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ఇప్పుడు ఆ మాత్రం పంటలు సాగు చేయగలుగుతున్నారు. అయితే ఇది రైతులకు తాత్కాలిక ఉపశమనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పంటలు చేతికి దక్కాలంటే రెండు నెలలపాటు సాగు నీళ్లు అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల కింద సాగు నీళ్లు అందించడం లేదు. ఈ నేపథ్యంలో పంటల చివరి దశలో నీళ్లు అందడం కష్టమేనని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇదే జరిగితే పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు అందుబాటులో ఉండటంతో ఊరుకోలేక పంటలు సాగు చేసుకొన్నామని, ఈ పంటలకు చివరిదాక నీళ్లు అందుతాయో? లేదో? పంటలు చేతికొస్తాయో? లేదో? అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.