జనగామ, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కాని రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం జనగామ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రుణమాఫీ కాని రైతులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆందోళన చేపట్టేందుకు వచ్చినట్టు భావించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వినతిపత్రం కోసం వెళ్తున్నట్టు చెప్పగానే లోనికి అనుమతించారు. నాలుగు మండలాలకు చెందిన రైతులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. అలాగే తన నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కొనసాగించి వెంటనే పూర్తి చేయాలని సూచించారు. బయటకు వచ్చిన తరువాత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణ మాఫీని పూర్తిస్థాయిలో నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రైతుల పక్షాన ఉద్యమించి సర్కారు మెడలు వంచుతామని స్పష్టం చేశారు. దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో ఇప్పటివరకు కేవలం 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. రుణమాఫీ హామీని సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో రుణమాఫీ కాని రైతు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు నిరసన తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. విజయ డెయిరీకి పాలు విక్రయిస్తున్నా రెండు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. – మిడ్జిల్