Heavy Rains | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెండు గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలు
గడిచిన 24 గంటల్లో మూడు జిల్లాల్లో అత్యంత భారీ, ఐదు జిల్లాల్లో అతి భారీ, పది జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కురిసిన వానలకు అనేక చెరువులు, కుంటలు నిండిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీటితోపాటు చెరువుల అలుగు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిదని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముం దస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌత మ్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం సమీపంలోని ము న్నేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కొన్ని చోట్ల కట్ట తెగి రోడ్లు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో పురాతన ఇండ్లు కూలాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ మాటు వరద ఉద్ధృతికి తెగింది. కేటీకే ఓసీపీ-1, కేటీకే ఓసీపీ-2 రెండు గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా తొ ర్రూ రు మండలంలో అలుగు పోస్తున్న చెరువులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. కాజీపేటలో ఓ ఇంటిపై పిడుగు పడి గోడలు బీటలు వారాయి. విద్యుత్తు మీటర్, వైర్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ఖాళీపోయాయి. కాలనీలోని చాలామంది ఇండ్లల్లో ఎలక్ట్రికల్ వస్తువులు, విద్యు త్తు మీటర్లు దగ్ధమయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం పసుపులలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి మొసళ్లు కొట్టుకొచ్చాయి.
Rain
33 శాతం అదనంగా వర్షపాతం: డైరెక్టర్
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు. నల్లగొండ జిల్లా మినహా రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో అత్యంత అధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వివరించారు.