హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా విధులను అప్పగిస్తుండటంతో గురుకులాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయులకే డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను కేటాయించడంతో పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థులకే కిచెన్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు మొత్తం 1,022 వరకు ఉన్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 800కు పైగా కొనసాగుతున్నాయి. వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణకు వార్డెన్లను నియమించారు. గురుకుల నిర్వహణకు మాత్రం వార్డెన్లను నియమించలేదు. రాష్ట్రంలో ఎస్సీ సొసైటీ పరిధిలో 268 గురుకులాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్యూటీ వార్డెన్ల డ్యూటీల కోసం ఏసీటీలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికగా నియమించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 263మంది ఏసీటీలను తొలగించింది. ప్రిన్సిపాళ్లకు సహాయంగా 8,9,10వ తరగతి విద్యార్థులతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారికే డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను అప్పగిస్తున్నది. మైనార్టీ గురుకులంలో డిప్యూటీ వార్డెన్లను ఔట్సోర్సింగ్ పద్ధతిన కొనసాగిస్తున్నారు. గిరిజన గురుకుల సొసైటీలో సీనియార్టీ ప్రకారం 3నెలలకు ఒకరు చొప్పున టీజీటీ, పీజీటీకే డిప్యూటీ వార్డెన్ విధులను కేటాయిస్తున్నారు. జనరల్ గురుకుల సొసైటీలో 6నెలలకు ఒకరి చొప్పున విధులు కేటాయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
బీసీ గురుకులంలో లైబ్రేరియన్, ఆర్ట్స్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు మాత్రమే విధులు కేటాయించాలని నిర్ణయించారు. ఒకరితోనే ఏడాది మొత్తం విధులు నిర్వర్తింపజేయాలని సొసైటీ ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం తీరుపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డైట్ ఇంప్లిమెంటేషన్ కోసం ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని, లేదంటే గతంలో లాగా అసిస్టెంట్ కేర్ టేకర్లనైనా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలతో పనిచేయించడమేంటని, ఏదయినా అనుకోని సంఘటన జరిగితే బాధ్యులెవరని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
అకారణంగా, అర్ధాంతరంగా విధుల్లో నుంచి తొలగించిన తమను తిరిగి చేర్చుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు అసిస్టెంట్ కేర్ టేకర్లు(ఏసీటీ) మొరపెట్టుకున్నారు. ఇదే విషయమై తొలుత సొసైటీ ఉన్నతాధికారులతో సైతం మంత్రి చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే ఏసీటీలను తొలగించామని సొసైటీ కార్యదర్శి, ఉన్నతాధికారులు నివేదించారని మంత్రి, ఏసీటీలకు వివరించారు. ఇందులో తానేమి చేయలేనని మంత్రి వివరించారని ఏసీటీలు తెలిపారు. ఈ విషయమై మరోసారి చర్చిస్తానని మంత్రి సమాధానమిచ్చారని ఏసీటీలు వాపోయారు. సొసైటీ కార్యదర్శి పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఏసీటీలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో డైట్ అమలు కోసం గతంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 263మందిని ఏసీటీలను నియమించారు. పదేండ్లుగా వారు పనిచేస్తున్నారు. ఇటీవల ఏసీటీలను సొసైటీ కార్యదర్శి తొలగించారు. దీంతో ఏసీటీలు ఆందోళన బాటపట్టారు. అందులోభాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు.
ఎస్సీ గురుకులంలో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను విద్యార్థులకే కేటాయించడం దారుణం. విద్యార్థులకు అవగాహన కల్పించడం వేరు. విద్యార్థులతో పనిచేయించడం వేరు. ఏదయినా అనుకోని సంఘటన జరిగితే బాధ్యతంతా ప్రభుత్వానిదే. ఇకనైనా పునరాలోచించుకుకోవాలి. గతంలో మాదిరిగా డైట్‌ను అమలు చేసేందుకు ఏసీటీలను కొనసాగించాలి. ఉపాధ్యాయులపై కూడా భారం లేకుండా ప్రత్యేకంగా వార్డెన్లనూ నియమించాలి.
– నర్సింహ, ప్రొగ్రెసివ్ పేరంట్స్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు