సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 9 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత (Congress Leader) నిర్వాకం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో సదరు నాయకుడు అంగన్వాడీ కేంద్రంలో (Anganwadi) సర్వే రికార్డులను మాయం చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం సారంపల్లి అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ ఇటీవలే రిటైర్డ్ కాగా.. బద్దెనపల్లి అంగన్వాడీ టీచర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇన్చార్జి టీచర్ కూతురి వివాహం ఉండటంతో ఆమె సెలవులో ఉన్నారు. దీంతో ఈ నెల 7న గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితోపాటు మరో ముగ్గురు కలిసి స్థానిక అంగన్వాడీ కేంద్రంలోకి చొరబడి బీరువాలోని 3 సర్వే రికార్డులను మాయం చేసినట్టు గ్రామంలో ప్రచారం జరుగుతున్నది.
అంగన్వాడీ ఆయా సైతం నలుగురు వచ్చిండ్రని, రిజిష్టర్లను తీసుకెళ్లినట్టు పేర్లతో సహా గ్రామస్థులతో చెప్పినట్టు సమాచారం. ఆయా చెప్పిన మాటలను స్థానికులు రికార్డు చేయడం గమనార్హం. ఈ విషయం గురువారం బహిర్గతం కావడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయం బయటకు పొక్కడంతో సదరు నాయకుడు ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదిలావుండగా అంగన్వాడీ కేంద్రంలో రికార్డుల మాయం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం సైతం తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
అంగన్వాడీలో రికార్డులు మాయం కా వడంతో ఎట్టకేలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై తంగళ్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈనెల 7న గుర్తుతెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రంలోకి చొరబడి, బీరువాలోని సర్వే రిజిష్టర్లను ఎత్తుకెళ్లారని సీడీపీవో ఉమారాణి, ఇన్చార్జి టీచర్ పద్మ, ఆయా భారతి ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్టు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.