Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ వేసవి పాత రికార్డులను తిరగరాసేలా ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగనున్నట్టు అధికారులు పేరొంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో మహబూబ్నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతే.. ఇక ఏప్రిల్, మే నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 35.7 నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా రావినూతలలో 37.7 డిగ్రీల గరిష్ఠ, జనగామలో 35.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అదేవిధంగా పెద్దపల్లి 37.6, భద్రాద్రి, జగిత్యాల, జోగులాంబగద్వాల తదితర జిల్లాల్లో 37.5 డిగ్రీల చొప్పున నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.