హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివరించారు. శాసనసభలో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సివిల్ సైప్లె అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదేండ్లలో ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో గత పదేండ్లలో 8 కోట్ల 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అమ్మాలని, రూ.7 వేల కోట్లు ఖజనాకు జమా చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో కేవలం రూ.3,000 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు మాత్రమే జమ చేశారని చెప్పారు.