Inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. బోర్డు చరిత్రలోనే ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే అమ్మాయిలే సత్తాచాటారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ అదరగొట్టి టాపర్లుగా నిలిచారు. ఫస్టియర్‌లో 66.94శాతం, సెకండియర్‌లో 75.61 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. కరో నా సమయంలో వంద శాతం ఉత్తీర్ణతను మినహాయిస్తే ఇదే అత్యధిక ఉత్తీర్ణతా శాతం కావడం విశే షం.
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, సీజీజీ డైరెక్టర్ రవిగుప్తా ఈ ఫలితాలను విడుదల చేశారు. నిరుటితో పోల్చితే ఫస్టియర్‌లో 0.3శాతం, సెకండియర్‌లో ఏకంగా 4.18శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 4,41,864మంది విద్యార్థులు హాజరుకాగా 2,95,780 మంది, సెకండియర్‌లో 4,11,474 హాజరుకాగా 3,11,112 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఏడాదీ అమ్మాయిల హవా కొనసాగిం ది. బాలికలు ఫస్టియర్‌లో 74.43%, సెకండియర్‌లో 78%తో అదరగొట్టారు. బాలురు ఫస్టియర్‌లో 59.21%, సెకండియర్‌లో 62.94% పాసయ్యారు. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయమే ఈసారీ పునరావృతమైంది.
ఇక జిల్లాలవారీగా ఫలితాలు చూస్తే సెకండియర్, ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సెకండియర్ (రెగ్యులర్)లో 82.73%తో మేడ్చల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 82.34శాతంతో జయశంకర్ భూపాలపల్లి రెండోస్థానం, 82.16%తో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఫస్టియర్‌లో 77.31శాతంతో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా 76.38%తో రెండోస్థానంలో, జయశంకర్ భూపాలపల్లి 73.04శాతంతో మూడోస్థానంలో నిలిచింది. సెకండియర్(రెగ్యులర్) ఫలితాల్లో 58.69% తో రాజన్న సిరిసిల్ల, ఫస్టియర్‌లో 44.91%తో మహబూబాబాద్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యా హ్నం సెకండియర్ వారికి పరీక్షలు ఉంటాయని తెలిపారు. మే 22 నుంచి 25వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని, మే 26న ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష కూడా మే 26న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ 28న నిర్వహిస్తామని తెలిపారు.

ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు సాధించిన వారంతా అమ్మాయిలే. వారే స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఎంపీసీ సెకండియర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థి తీగల సాయిశ్రేష్టిత 997 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచింది. బైపీసీలో హైదరాబాద్ విద్యార్థి హఫ్సాబేగం, ఖమ్మం జిల్లా విద్యార్థి కొయ్య జ్యోత్స్నలిద్దరు 997 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. సెకండియర్ ఎంపీసీలో పది మంది స్టేట్ టాపర్లల్లో అందరూ అమ్మాయిలే కావడం గమనార్హం. సెకండియర్ బైపీసీలో టాప్ 10లోను పదికి పది మంది అమ్మాయిలే ఉన్నారు. ఇక బైపీసీ కోర్సులో టాప్-6 విద్యార్థుల్లో నలుగురు నిర్మల్ జిల్లా, ఇద్దరు కరీంనగర్ జిల్లా విద్యార్థులు కావడం గమనార్హం. ఫస్టియర్ ఎంపీసీలో 10మంది విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. ఈ పది మంది టాపర్లుగా నిలువడం విశేషం. బైపీసీలో ఆరుగురు 439, సీఈసీలో నలుగురు 495మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. వెయ్యికి 997 మార్కులు, 470కి 469 మార్కుల చొప్పున సాధించి విద్యార్థులు సత్తాచాటారు.






పరీక్షల షెడ్యూల్
