e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు
  • వేగంగా ఎఫ్‌పీజడ్‌లు ఆసక్తి వ్యక్తీకరణ
  • దరఖాస్తులకు ఆహ్వానం
  • 9 ఉమ్మడి జిల్లాల్లో భూముల ఎంపిక
  • పెద్ద ఎత్తున ఆసక్తిచూపుతున్న పరిశ్రమలు

సాగునీటితో సుజల తెలంగాణ అయి.. వ్యవసాయంతో సుఫల తెలంగాణగా మారిన రాష్ట్రం.. ఇప్పుడు ఆహార తెలంగాణగా రూపాంతరం చెందనున్నది. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ వందల ఎకరాల్లో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటున్నది. హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ భూముల సర్వే పూర్తయింది. ఈ ప్రక్రియకు సమాంతరంగా తెలంగాణ పరిశ్రమల సంస్థ.. ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సెజ్‌లలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. ఆహార పార్కుల ఏర్పాటుతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోనున్నది.

హైదరాబాద్‌, జూన్‌ 16 (నమస్తే తెలంగాణ)/నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: తెలంగాణ ప్రగతిబాటలో కీలక మైలురాయిని సమీపించిం ది. ఏడేండ్లలోనే వ్యవసాయతెలంగాణగా మారి న రాష్ట్రం.. ఇక దేశానికే ఆహార రాజధానిగా ఆవిర్భవించనున్నది. మన రాష్ట్రంలో పండిన ఆహార పంటలను మన దగ్గరే ప్రాసెస్‌ చేయడం ద్వారా ఉపాధి, ఆదాయ కల్పన చేయవచ్చన్న సీఎం కేసీఆర్‌ సంకల్పంతో రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో ఆహార పరిశ్రమలకోసం ప్రత్యేక జోన్ల ఏర్పాటుకు చర్యలు ఊపందుకొన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులను ఆర్థికంగా బలోపేతంచేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇందు లో భాగంగానే ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేయాలనుకొనే ఔత్సాహికుల నుంచి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) దరఖాస్తులు ఆహ్వానించింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో నచ్చిన చోట ప్రతిపాదిత తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల (టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌)లో వీటిని ఏర్పా టు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఔత్సాహికులు ఈనెల 15నుంచి www. tsiic.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలు.. తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫారం కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నదని, దరఖాస్తుతోపాటు రూ.10 లక్షలు అడ్వాన్స్‌, అప్లికేషన్‌ ఫీజు రూ.5000 (18 శాతం జీఎస్‌టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ జిల్లాలకు దరఖాస్తు చేసేవారు విడివిడిగా దరఖాస్తులు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ స్థలం కేటాయించకపోతే రూ.10 లక్షల అడ్వాన్స్‌ ఫీజు నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లిస్తామని వివరించారు. ఇప్పటికే టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించామని, కచ్చితమైన ప్రదేశాన్ని త్వరలోనే నోటిఫైచేస్తామని వెల్లడించారు. స్థానికంగా లభించే వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జో డించేందుకుగాను ప్రాసెస్‌ చేసేందుకు టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌లలో సదుపాయాలు కల్పిస్తారు.
నర్మాలలో 269 ఎకరాల కేటాయింపు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం నర్మాలలో 269 ఎకరాల స్థలాన్ని ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం కేటాయించింది. ఇప్పటికే 15 ఎకరాలలో ‘అగస్త్య సూపర్‌ ఫుడ్స్‌ ఇండియా లిమిటెడ్‌’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ గత ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేశారు. రోడ్లు, మౌలిక వసతుల కోసం టీఎస్‌ఐఐసీ డీపీఆర్‌ సిద్ధంచేస్తున్నది.
ఖమ్మానికి పరిశ్రమల కళ
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండావద్ద సుమారు వందెకరాల భూ మిని గుర్తించిన అధికారులు సర్వే పూర్తిచేస్తున్నారు. మరో 150ఎకరాల కోసం అన్వేషిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు పూర్తయితే జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల విలువచేసే పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది.
పలు జిల్లాల్లో పెద్దఎత్తున భూసేకరణ
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో ఒకేచోట 250 ఎకరాలను సేకరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌, తాడ్వాయి మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 675 ఎకరాల సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా భిన్నమైన పంటల సమాహారమైనందున ఇక్కడి రైతులకు మేలు చేకూర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్కారు దృష్టిపెట్టింది. పసుపు, మక్క, సోయా, వరి, కందు లు, శనగ ఆధారిత పరిశ్రమలను స్థాపించడానికి పరిశోధన పూర్తి చేశారు.
నల్లగొండ జిల్లాలో రైస్‌మిల్లింగ్‌ జోన్‌
నల్లగొండ జిల్లా దామరచర్లలో రైస్‌మిల్లింగ్‌ జోన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిం ది. మిర్యాలగూడ సమీపంలోని దామరచర్లలో యదాద్రి థర్మల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 5వేల ఎకరాలను సేకరించింది. అందులో ప్రస్తుతం 4,500 ఎకరాలే వినియోగిస్తున్నారు. మిగిలిన భూమిలో 250 ఎకరాలను తీసుకుని రైస్‌మిల్లింగ్‌ జోన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. దీంతోపాటు చిట్యాల మండలం వెల్మినేడులో, చిట్యాల, కట్టంగూర్‌, కేతేపల్లి, గు ర్రంపోడు మండలం తానేదారుపల్లిలో భూమి అందుబాటులో ఉన్నది.
వరంగల్‌లో వేగంగా ‘ఫుడ్‌ ప్రాసెస్‌’ సర్వే..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. జనగామజిల్లా దేవరుప్పులలో 145ఎకరాలు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండ లం వంగరలో 600, వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడలో వందఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు, ఇతర గ్రామాల్లోనూ లభ్యతను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌లలో కల్పించనున్న సౌకర్యాలు
రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, ఉమ్మడి వ్యర్థ జలాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ), ఘన వ్యర్థాల నిర్వహణకు సౌకర్యాలు.
యూనిట్ల ఏర్పాటుకు అనువైన షెడ్ల నిర్మాణం. జీఐఎస్‌ ఆధారిత లేఔట్‌ ప్లాట్లు ఆన్‌లైన్‌ ద్వారా చూసి ఎంపికచేసుకునే సదుపాయం.
సింగిల్‌ విండోపద్ధతిలో పర్యావరణం సహా అన్ని అనుమతులు.
నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలుగకుండా బఫర్‌ జోన్‌ ఏర్పాటు.
టీ- ఐడియా, టీ-ప్రైడ్‌ పథకాలతోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ప్రకారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు
టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌లను ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐఏఎల్‌ఐ)లుగా నోటిఫై చేసి టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు.
ఐలాలు ఆస్తిపన్ను, నిర్వహణ చార్జీలు, యూజర్‌ జార్జీలు వసూలుచేయడం ద్వారా వచ్చే సొమ్ముతో వీటిని నిర్వహిస్తారు.

వర్గల్‌లో 900 ఎకరాల్లో మెగా పార్కు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని వర్గల్‌లో 900 ఎకరాల్లో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి, కంకోల్‌ గ్రామాల్లో 128 ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌కు భూసేకరణ పనులు పూర్తిచేశారు. వర్గల్‌లో 900 ఎకరాలు సేకరించారు. లింగంపల్లి, కంకోల్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ చొరవతో 128 ఎకరాలను గుర్తించగా.. మరో 50 ఎకరాలను గుర్తించి టీఎస్‌ఐఐసీకి అప్పగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పత్తి, మొక్కజొన్న, వరి, వేరుశనగ, కంది, పెసర, శనగ, కూరగాయలు, స్వీట్‌కార్న్‌ సాగుకు పెట్టింది పేరు. సంగారెడ్డిలో పత్తి, అల్లం, ఆలుగడ్డ్డ, పసుపు, కూరగాయలు, పండ్ల తోటలు ఎక్కువగా సాగుచేస్తున్నారు.

ఇప్పటివరకు సేకరించిన భూమి వివరాలు (ఎకరాల్లో)
నర్మాల (రాజన్న సిరిసిల్ల) 269
వర్గల్‌ (సిద్దిపేట) 900
సంగారెడ్డి 128
ఖమ్మం 150
నిజామాబాద్‌ 250
కామారెడ్డి 675
నల్లగొండ 250
జనగామ 145
వరంగల్‌ అర్బన్‌ 600
వరంగల్‌ రూరల్‌ 100

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement