IDA Bollaram | హైదరాబాద్/జిన్నారం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్‌కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మాటల్లో పసలేదని తేలిపోతున్నది. పారిశ్రామిక వాడల్లోని విలువైన భూముల్లో లంకె బిందెలను వెతుక్కోడానికే ముఖ్యనేత తొందర పడుతున్నట్టు రూఢీ అయింది. నిజంగా కాలుష్యం నుంచి నగరాన్ని రక్షించాలనే ఆలోచనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఉంటే.. ముందుగా ఏ పారిశ్రామిక వాడను ఔటర్ బయటికి తరలించాలి? దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య వాడగా గుర్తింపు పొందిన ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడను తక్షణమే నగరానికి దూరంగా తరలించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్సూచించిన ప్రమాణాల కంటే ఎక్కువ మొత్తంలో కాలుష్య మూలకాలు ఇక్కడ ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది.
బొల్లారంను దేశంలోనే నంబర్ 1 కాలుష్య వాడగా గుర్తించింది. బొల్లారం పారిశ్రామిక పాంతం, దాని పరిసర గ్రామాల్లో మానవ నివాస యోగ్య వాతావరణమే లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆవేదన వ్యక్తంచేసింది. ఈ లెక్కన అత్యంత వేగంగా, ఇంకా చెప్పాలంటే యుద్ధప్రతిపాదికన బొల్లారం ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఖాళీ చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ అమలు చేస్తూ ఇచ్చిన 27వ నంబర్ ఉత్తర్వుల్లో బొల్లారం పేరే లేదు. ఇదేం విచిత్రం అని ఆరా తీస్తే ఇక్కడి భూములు గజం ధర రూ.3100 మించి పలికే పరిస్థితి లేదట! ఇంత చౌకైన భూములు వద్దని, ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బొల్లారం భూములను హిల్ట్ పాలసీ పరిధిలోకి తేలేదని సమాచారం.
1981లో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా (ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా)లో ఐడీఏ బొల్లారం ఏర్పడింది. 975 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 320 భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ 100కు పైగా అత్యంత ప్రమాదకర రెడ్ క్యాటగిరీ ఫార్మా, కెమికల్, స్టీల్ పరిశ్రమలు నడుస్తున్నాయి. మిగిలినవి గ్రీన్, ఆరెంజ్ క్యాటగిరీ పరిశ్రమలున్నాయి. అనధికార లెక్కల ప్రకారం చిన్నా చితక ఎమ్మెస్సెన్ కంపెనీలతో కలుపుకొని 175 పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 45 ఏళ్లుగా ఇక్కడ ఫార్మా, కెమికల్ కంపెనీలదే ఆధిపత్యం. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలకు ఐడీఏ బొల్లారం అడ్డాగా ఉన్నదని శాస్త్రీయ పరిశోధనలు తేల్చాయి. ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల ద్వారా యాంటీ బయాటిక్ వ్యర్థాలు వెలువడటంలో ఐడీఏ బొల్లారం భారత దేశంలోనే నంబర్‌గా వన్‌గా ఉన్నదని, దీని తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని బిడ్డి, తమిళనాడు కడలూరులోని సిప్కాట్ పారిశ్రామిక వాడలు వరుసగా రెండు, మూడో స్థానాలు ఆక్రమించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఔషధ తయారీ పరిశ్రమల నుంచి క్రియాశీల ఔషధ పదార్థాలు పర్యావరణంలోకి విడుదలవుతున్నాయని, ఇది యాంటీ మైక్రోబయల్ నిరోధకత (ఏఎంఆర్) వ్యాప్తికి ప్రేరేపిస్తుందని, దీని ద్వారా క్షయవ్యాధి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ సంస్థ, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేశాయి.
బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే వారికి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం సోకడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని అంతర్జాతీయ సంస్థలు నిర్ధారించాయి. బొల్లారంలో వెయ్యి ఫీట్ల వరకు బోరు వేస్తే ఇక్కడ పసుపు పచ్చ రంగులో నీరు బయటకు వస్తుందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రమాణాల కంటే ఇక్కడి భూగర్భ జలాల్లో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, వనాడియం లాంటి విషపదార్థాలు అనేక వేల రెట్లు ఎకువ సాంద్రతలో ఉన్నట్టు సీపీసీబీ నిర్ధారించింది. ఓజోన్ వాయు కాలుష్యం దేశంలోనే బొల్లారం ప్రాంతంలో ఎక్కువ పాళ్లలో ఉన్నదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. దీని ద్వారా వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, తక్షణం చర్యలు తీసుకోకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పంటలకు సైతం గణనీయమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పింది. ఇక్కడ ఉన్నవి అత్యంత ప్రమాదకమైన మూలకాలు అని, క్యాన్సర్ కారకాలని, గర్భస్థ శిశువును చంపే విష మూలకాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రభావిత గ్రామాలన్నింటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం ఉన్నది కాబట్టి జనావాసాలకు దూరంగా నగరం బయటకు తరలిస్తున్నామని, అందుకోసమే హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్తున్న రేవంత్‌రెడ్డి మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను నగరానికి దూరంగా తరలించాల్సి ఉన్నది. హిల్ట్ పాలసీలో ఐడీఏ బొల్లారంను చేర్చలేదు. దానికి సమీపంలో బాంబే హైవేకు ఆనుకొని ఉన్న పటాన్చెరు పారిశ్రామిక వాడను మాత్రం పాలసీలో చేర్చారు. పైగా పటాన్చెరులో ఉన్న పరిశ్రమలు ఎక్కువగా గ్రీన్ క్యాటగిరీలోనే ఉన్నాయి. ఇక్కడ గజం ధర మార్కెట్ విలువ రూ.1.5 లక్షలు పలుకుతున్నదని చెప్తున్నారు. కానీ బొల్లారం పారిశ్రామిక వాడలో ఎస్ఆర్వో గజం ధర రూ.3,100 మాత్రమే ఉన్నది. హైదరాబాద్ సమీపంలోని 22 పారిశ్రామిక వాడల్లోని ధరల కంటే బొల్లారం పారిశ్రామిక వాడలోని భూముల ధర తక్కువ ఉన్నట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ప్రస్తుతం బొల్లారం పరిశ్రామిక వాడల్లో నడుస్తున్న ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రముఖులకు చెందినవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పట్లో వీళ్లు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని, ఇక్కడ హిల్ట్ పాలసీని అమల్లోకి తెచ్చినా ధర తక్కువ భూములతో పెద్దగా గిట్టుబాటు కాదనే నివేదికలు అందటంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలసీ నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది.