హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల జరిగిన సబ్ రిజిస్ట్రార్ల బదిలీలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమకు అనుకూలమైన ఒక సబ్ రిజిస్ట్రార్‌కు అనుకున్న చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు 12 మందిని బదిలీ చేశారని విమర్శలున్నాయి. ఓ మంత్రి కొడుకు ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టు ఆరోపణలున్నాయి. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసిన సబ్ రిజిస్ట్రార్లను అసెంబ్లీ ఎన్నికల ముందు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇందులో రంగారెడ్డికి చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ కూడా బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారని, ఆదాయం పడిపోవడంతో తిరిగి రంగారెడ్డి జిల్లాకు వ చ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారని తెలుస్తున్నది. ఇందుకోసం తన స్నేహితుడైన ఓ మంత్రి కుమారుడిని సంప్రదించినట్టు తెలిసింది. మంత్రి కొడుకు ఒత్తిడి చేయడంతో.. ఒక్కరినే బదిలీ చేయడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారని సమాచారం. దీంతో ఒక్కరి కోసం 12 మందికి స్థాన చలనం జరిగిందని చెప్పుకుంటున్నారు.
లింగాల, అక్టోబర్ 22: ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఘటనలో ఎస్సైపై బదిలీ వేటు పడింది. అచ్చంపేట సీఐ రవీందర్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ఈ నెల 13న పెట్రోల్ బంక్ నిర్వాహకులపై దాడి చేశారు. 14న బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యువకులను పోలీసులు స్టేషన్‌కు రప్పించి లింగాల ఎస్సై జగన్మోహన్ సమక్షంలో వారికి గుండు చేయించిన ఘటనపై విమర్శలతో ఎస్సైని బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.