హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఈసెట్) పరీక్ష విధానం సమూలంగా మారనున్నది. కొత్తగా అర్థమెటిక్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ సబ్జెక్టులను ఈ పరీక్షలో అంతర్భాగం చేయనున్నారు. పీజీఈసెట్ పరీక్ష రాసే వారంతా ఈ రెండు సబ్జెక్టులకు పరీక్షలు రాయాల్సిందే. ఒక్కో సబ్జెక్టుకు 25% చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నారు.
సంబంధిత సబ్జెక్టులకు 50% వెయిటేజీ ఉంటుంది. పీజీఈసెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ జేఎన్టీయూహెచ్ ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపించింది. ఇవి త్వరలోనే సర్కార్‌కు చేరుతాయి. ఈ ప్రతిపాదనలను సర్కార్ ఆమోదిస్తే 2027-28 విద్యాసంవత్సరంలో కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మహిళలు 13,468(94.31%) క్వాలిఫై అయ్యి సత్తాచాటారు. పురుషులు 10,169(91.02%) క్వాలిఫై అయ్యారు. ఈసారి ప్రాథమిక ‘కీ’ పై నాలుగు అభ్యంతరాలు రాగా, ఒక అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని, ర్యాంకులు ఖరారుచేశారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ కే వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
