హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ భూములేవో, ప్రైవేట్ భూములేవో గుర్తించలేని అంధకారంలో కలెక్టరేట్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారని, కలెక్టర్ల అసమర్థతవల్లే ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్నిరకాల క్లియరెన్స్ ఉన్నా ప్రైవేట్ భూములను కూడా నిషేధిత జాబితాలోకి చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని అసోసియేషన్ ధ్వజమెత్తింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల అసమర్థతకు ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమని మండిపడింది. సొంత భూములపై హక్కులు కోల్పోతున్న ప్రజల ఆవేదన క్యూర్ పరిధిలోని ప్రధానమైన మూడు జిల్లాల కలెక్టర్లకు పట్టడం లేదని, అసలు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, కలెక్టర్లు ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో చెప్పలేకపోతున్నారని ఆరోపించింది.
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సేకరించిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చారు. పోచారం సర్వే నంబర్లోని 36, 50, కాచవాని సింగా రం సర్వే నంబర్ 43, చెంగిచర్ల సర్వే నంబర్ 33/2, పర్వతాపూర్‌లోని సర్వే నంబర్ 16, 17, 26, 27, 28 వంటి ప్రాంతాల్లో వందలసంఖ్యల్లో ప్లాట్లను, పదుల సంఖ్యలో వెంచర్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో కొనుగోలు చేసినవారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా… పట్టించుకొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్లు అక్రమ ఆదేశాలు జారీ చేసి 40 రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అసోసియేషన్ పేర్కొన్నది. ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ కోసం కలెక్టర్ల చుట్టూ తిరిగి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం పెద్ద తప్పిదమని, టైటిల్ క్లియర్ ఉన్న ప్రైవేట్ ఆస్తులను తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించాల్సిందిపోయి, తాము ఆదేశాలు ఇచ్చేంతవరకు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేందని హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులకు మధ్య తేడా గుర్తించకుండానే కలెక్టర్లు సృష్టిస్తున్న వివాదాలతో వేలాదిమంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వేలాదిమంది వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.