న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ వేదికగా సెప్టెంబర్ 15నుంచి 28 వరకు జరిగే ఈ మెగా టోర్నీ ఓపెన్ సెక్షన్లో తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్‌తో కూడిన అబ్బాయిల జట్టు రెండో సీడ్‌గా పోటీ పడనుంది.
అమెరికా టీమ్‌కు టాప్ సీడింగ్ దక్కింది. గత ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గి డిఫెడింగ్ చాంపియన్ల హోదాతో ఈ టోర్నీకి సిద్ధమవుతున్నాయి. ఓపెన్‌లో అమెరికాతో పాటు మూడో సీడ్, ఆతిథ్య జట్టు ఉజ్బెకిస్థాన్, చైనా, జర్మనీ, నెదర్లాండ్స్ బలమైన పోటీదారులుగా ఉన్నాయి. అమ్మాయిల జట్టుకు రెండో సీడ్ జార్జియాతో పాటు కజకిస్థాన్, చైనా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 46వ ఎడిషన్ ఒలింపియాడ్‌లో రికార్డు స్థాయిలో 400 జట్లు పోటీ పడనున్నాయి. ఓపెన్‌లో 208, మహిళల విభాగంలో 192 దేశాలు పోటీలో ఉన్నాయి.