FTL | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : హైడ్రో ఫోబియా.. ఈ మానసిక వ్యాధి ఉన్నవాళ్లు నీళ్లంటే భయపడతారు. ఇదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో రెండు రకాల ఫోబియాలు నడుస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ‘హైడ్రా’ ఫోబి యా హడలెత్తిస్తుంటే, రాష్ట్రం మొత్తం ‘ఎఫ్టీఎల్ ఫోబియా’ కమ్మేస్తున్నది.
ఇన్నాళ్లూ హైదరాబాద్‌లో లేక్ వ్యూ అంటే చాలు హాట్‌కేకుల్లా అమ్ముడైన ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇం డ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన యజమానులు బిక్కుబిక్కుమంటున్నారు. ఔటర్ దాటి న తర్వాత పట్టణాలు, గ్రామాల్లో ‘ఎఫ్టీఎల్’ ఫోబియా స్పష్టంగా కనిపిస్తున్నది. ‘సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రెండేండ్ల కిందట ఒక ప్లాట్ కొన్నారు. వెంచర్‌కు రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అనుమతులు ఉండటంతో ధైర్యంగా దాదాపు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు.
భవిష్యత్తులో తన కొడుకులకు పనికొస్తుందని భరోసాగా ఉన్నారు. హైడ్రా హడావుడి మొదలైన తర్వాత తన ప్లాట్ కూడా చెరువుకు సమీపంలో ఉన్న విషయం గుర్తుకొచ్చిం ది. వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు వెళ్లి పాత మ్యాప్‌లు తీసుకొని పరిశీలించారు. కొత్త డాక్యుమెంట్లలో వెంచర్ చెరువుకు దూరంగా కనిపిస్తుంటే, పాత మ్యాపుల్లో మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు తేలింది. అప్పటి నుంచి ఆయనకు నిద్ర లేదు’.. ఇది ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంట లు, వాగులకు దగ్గర్లోని వెంచర్లలో ప్లాట్లు తీసుకున్నవారు, ఇండ్లు కట్టుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా మో లేదో తెలుసుకునేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
హైడ్రా, మూసీ పరీవాహకంలో కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకు నేలచూపులు చూస్తున్నది. ప్రతి నెలా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగే రియల్ ఎస్టేట్ రం గం క్రమంగా కుదేలవుతున్నది. కాంగ్రెస్ ప్ర భుత్వ పాలన మొదలై పది నెలలు కావస్తున్నా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి దోహదం చేసే భరోసా ప్రభుత్వం నుంచి లేకపోగా, హైడ్రా వంటి కార్యకలాపాలు కొనుగోలుదారులను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. వెంచర్లో ప్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా, విల్లాలు తీసుకోవాలన్నా కొనుగోలుదారులు అడుగుతున్న మొదటి ప్రశ్న.. ‘మీ ప్రాజెక్టు చెరువు, నాలాకు ఎంత దూరంలో ఉంది?’ అని. బిల్డర్లు దీనికి స్పష్టమైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండగా.. హైదరాబాద్ పరిధిలో కొ త్త ప్రాజెక్టులు సైతం మొదలు కావడం లేదు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కరోనా సమయంలో పెద్ద ప్రభావానికి గురి కాలేదని, క్రమంగా వృద్ధిరేటు పెరిగిందే తప్ప, ఏమాత్రం తగ్గలేదని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో రావడంతో ఒక్కసారిగా కొనుగోళ్లు తగ్గుతున్నాయే తప్ప ఏమాత్రం పెరగడం లేదు. ఇటీవలే ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించిన ఓ సర్వేలో ఇదే విషయాన్ని పేర్కొంది. ఒకేసారి 42 శాతం కొనుగోళ్లు తగ్గాయని వెల్లడించింది.
గత 2-3 నెలలుగా హైడ్రా దూకుడు రియల్ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఫార్మాసిటీ, ఎయిర్‌పోర్టు మెట్రో రద్దుతోనే మొదలైన పతనం మరింత నేలచూపులు చూస్తుండడంతో భారీ ప్రాజెక్టులు మొదలుకొని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను కొనేవారు కరువయ్యారు. రియల్ ఎస్టేట్ సంస్థ లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో లక్షకు పైగా అమ్ముడుపోని ఫ్లాట్లు ఉండగా, నిర్మాణంలో, అనుమతులు వచ్చిన ప్రాజెక్టుల్లో కలుపుకుంటే మరో 2 లక్ష ల దాకా ఉంటాయని పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఉ న్న ప్రాజెక్టుల్లోని అపార్ట్మెంట్లను, విల్లాలను హైడ్రా కూల్చివేయడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేడయమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. రియల్ ఎస్టే ట్ రంగం ఎప్పుడు పుంజుకుంటుందో చెప్పలేమన్న అభిప్రాయాన్ని బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు.