Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలో రియల్టీ రంగం దూసుకుపోతుంటే.. ప్రజల్లో కొత్త ఇల్లు కొనుగోలు చేసే స్థోమత తగ్గిపోతున్నదని మ్యాజిక్బ్రిక్స్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఆదాయం, ఖర్చుల మధ్య అంతరాల కారణంగా ఈఎంఐలూ భారంగా మారుతున్నాయని పేర్కొన్నది. ఈఎంఐల భారం గత ఏడాదితో పోలిస్తే 7.5 శాతం పెరిగినట్టు తెలిపింది.
మ్యాజిక్బ్రిక్స్ దేశంలోని పది మెట్రో నగరాల్లో కొనుగోలు స్థోమతను అంచనా వేసింది. కొనుగోలు స్థోమత అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (14.3%), ఢిల్లీ (10.1%)లో ఉన్నట్టు పేర్కొన్నది. 2021-2022 నాటికి దేశంలో రెసిడెన్షియల్ రంగంలో పెట్టుబడులు భారీగా ఉండేవని మ్యాజిక్ బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. పెరిగిన వడ్డీ రేట్లు, ఖర్చు భారం తో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు సామాన్యుడికి దూరమైతున్నాయని వివరించారు.