హుస్నాబాద్ టౌన్, మే 4: ‘ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చించడానికి సిద్ధ్దంగా ఉన్నామని, మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని’ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను ఆదివారం తనిఖీచేసి ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులతో మాట్లాడారు. తాను సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఎవరైనా ఎప్పుడైనా తనను కలవవచ్చని చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ, కా ర్మికుల సంక్షేమం, ప్రయాణికుల మెరుగైన సేవలకు ప్రాధ్యానతను ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్న క్రమంలో సమ్మె చేస్తే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అవుతుందని, సంస్థను కాపాడుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులెన్ని? ; బిల్డ్‌నౌ’ అప్లికేషన్లపై వివరణ ఇవ్వని అధికారులు
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం ‘బిల్డ్‌నౌ’ పోర్టల్ ద్వారా 1,500కుపైగా దరఖాస్తులు స్వీకరించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 20న ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 45 రోజుల్లో మొత్తం 1,547 అప్లికేషన్లు వచ్చినట్టు ప్రకటించారు. ‘ఇండ్లకు అనుమ తి ఏది?’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందిస్తూ.. ‘బిల్డ్‌నౌ’ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం ఒక్కరోజే 59 దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపారు. గత నెల 3 నుంచి ‘టీజీ బీపాస్’ ద్వారా కాకుండా ‘బిల్డ్‌నౌ’ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ‘బిల్డ్‌నౌ’ పోర్టల్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వెల్లడించలేదు.