మణికొండ, నవంబర్ 20: నిర్మాణరంగ సంస్థలు ఇష్టానుసారం జనావాసాల మధ్య ఏర్పాటుచేస్తున్న రెడీమిక్స్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని నార్సింగి/మణికొండ మున్సిపాలిటీల పరిధిలో కొంతమంది బడా బిల్డర్లు నిబంధనలను పట్టించుకోకుండా జనావాసాల మధ్యనే రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలాంటి వాటిని తక్షణమే మూసివేయించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యహరిస్తుండటం స్థానికులకు శాపంగా మారుతున్నది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఒక నిర్మాణరంగ సంస్థ జనావాసాల మధ్యనే రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నది. వాసవీ అట్లాంటిస్ పేరుతో క్యాప్టివ్ రెడీమిక్స్ ప్లాంట్‌ను 2021లో స్థాపించారు.
ఈ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి సమస్యగా మారిందంటూ స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి అధికారులు వాటిని మూసివేయాలంటూ నోటీసులు జారీచేశారు. కొన్నాళ్లు పనులను నిలిపివేసిన యాజమాన్యం తిరిగి 2023లో మళ్లీ అదే రెడీమిక్స్ ప్లాంట్‌ను స్థాపించి, తమను అవస్థలకు గురిచేస్తున్నదని మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా అపార్టుమెంట్ వాసులు వాపోతున్నారు. గత పదినెలలుగా ఈ ప్లాంటును మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలికి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు. ఈ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి 100-150 మీటర్ల దూరంలో ఉన్న బహుళ అంతస్తుల టౌన్‌షిప్‌లు, హౌసింగ్ కాంప్లెక్స్‌ల మీద సైతం ప్రభావం చూపుతున్నది. ఆర్ఎంసీ ప్లాంట్లు తమ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా 200 మీటర్ల దూరంలో ఉన్న చెట్లు, జంతుజాలంపై కూడా ప్రభావం చూపుతున్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రవహించే సహజ నీటి వనరు పూర్తిగా కలుషితమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అల్కాపూర్ టౌన్షిప్, పుప్పాలగూడ, ల్యాంకోహిల్స్, ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ రహదారి, మైహోం అవతార్ వెనుక, ముప్పా అక్షజ అపార్టుమెంట్ ఎదురుగా అనేక ప్రాంతాల్లో రెడీమిక్స్ ప్లాంట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యంత్రాంగం చేతులెత్తేసిందని స్థానికులు మండిపడుతున్నారు. పీసీబీ నోటీసులు జారీచేసినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నిర్మాణదారులు ఎక్కడపడితే అక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీటి నుంచి నిత్యం వెలువడే దుమ్ము, ధూళి కారణంగా శ్వాసకోశ వ్యాధులతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదే విషయంపై ఇటీవల మణికొండ మున్సిపాలిటీ సిటీకౌన్సిల్ ప్రతినిధులతో కలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు మరోసారి విన్నవించగా, నిర్మాణదారులతోపాటు స్థానిక ప్రజలతో కలిసి పీసీబీ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో రెడీమిక్స్ ప్లాంట్‌ను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు స్పందించడం మానేశారంటూ హాల్‌మార్క్ విసినియా నివాసితుడు గౌతం కృష్ణ తెలిపారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పారు. అయినా సదరు నిర్మాణ రంగ సంస్థ తమ పలుకుబడిని ఉపయోగించి రెడీమిక్స్ ప్లాంట్లను రాత్రింబవళ్లు నడుపుతూనే ఉన్నది.
పశ్చిమగోదావరి జిల్లాలోని అందాలను తలపిస్తూ, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాలు పచ్చని పొలాలకు నెలవుగా ఉండేవి. రెడీమిక్స్ ప్లాంట్ల ఏర్పాటుతో ఈ ప్రాంతాల్లో వ్యవసాయం కనుమరుగైంది. వ్యవసాయ క్షేత్రాలు బీడు భూములుగా మారిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అన్నదాతలు కూలీలుగా మారిపోతున్నారు. వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో నిత్యం రహదారులన్నీ దుమ్ము రేగుతూ దర్శనమిస్తున్నాయి. వీటిని తక్షణమే నిలిపివేయాలంటూ ఇరు గ్రామాల ప్రజలు రోడ్లెక్కి ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఆర్ఎంసీ ప్లాంట్ల ఏర్పాటుతో కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వాయి నాణ్యతా నమోదు క్రమంగా తగ్గిపోతున్నది. పీఎం 10 ధూళి కణాల స్థాయి అధికంగా విడుదలవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. నిర్మాణ రంగంలో కార్యకలాపాలు, ఆర్ఎంసీ యూనిట్ల నుంచి వెలువడే దుమ్ము కణాలతోనే వీటి సూచీ పెరుగుతున్నదని పీసీబీ అధికారులు వెల్లడించారు. 15 రోజుల్లో కేవలం నాలుగు రోజులు మాత్రమే వాయు నాణ్యత సూచీ 100లోపు నమోదు కాగా మిగిలిన రోజుల్లో 105 నుంచి 153 మధ్య నమోదు అవుతున్నట్టు తెలిపారు.
గత కొన్నిరోజులుగా స్థానిక ప్రజల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వాటిపై స్పందించిన పీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. త్వరలోనే మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి పనులను నిలిపివేశాం.
-విజయ్‌కుమార్, వాసవీ నిర్మాణరంగ సంస్థ యజమాని
వాసవీ అట్లాంటిస్ నిర్మాణ రంగ సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్ఎంసీ ప్లాంట్‌ను నడుపుతున్నది. ఫలితంగా పక్కనే ఉన్న నివాసితులంతా దుమ్ము, ధూళితో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాం. పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు మరెక్కడా లేవు. ఈ ప్రాంతంలో ప్లాట్లు కొనడమే పాపమైంది. కొత్తగా కొనాలనుకొనేవారు ఈ ప్రాంతంలో ప్లాట్లు
కొనకపోవడమే ఉత్తమం.
– గౌతం కృష్ణ, హాల్‌మార్క్ విసినియా నివాసితుడు
మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా అపార్టుమెంట్లలోని దాదాపు 15,000 మంది జనాభా రెడీమిక్స్ ప్లాంట్ల వల్ల నిత్యం అవస్థపడుతున్నాం. కొన్నిరోజులుగా కొన్ని భవన నిర్మాణ సంస్థలకు చెందిన ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తున్నారు. దీనిపై మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సైతం విన్నవించాం. వారు స్పందించకపోతే ఆందోళనలకు దిగుతాం. రెడీమిక్స్ ప్లాంట్ల యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోలేం.
– అందె లక్ష్మణ్‌రావు, సిటిజన్ కౌన్సిల్ ప్రతినిధి