హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనున్నది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందులో భాగంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల(యూఎల్బీ)కు సంబంధించి వార్డులవారీగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. సోమవారం కేవలం ఓటర్ల జాబితాను వెల్లడించిన ఎస్ఈసీ.. మంగళవారం వార్డులవారీగా ఫొటోలతో కూడిన తుది జాబితాను ప్రకటించింది. మొత్తం 123 యూఎల్బీలను 2,996 వార్డులుగా విభజించినట్టు తెలిపింది.
మొత్తం ఓటర్లు 52,43,023 మంది ఉండగా, వీరిలో పురుషులు 25,62,369 మంది, మహిళలు 26,80,014 మంది, ఇతరులు 640 మంది ఉన్నట్టు వివరించింది. పురుషులతో పోలిస్తే 1,17,645 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్టు తెలిపింది. కరీంనగర్ కార్పొరేషన్‌ను 66 వార్డులుగా, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రికొత్తగూడెంలను 60 వార్డుల చొప్పన విభజించారు. మొత్తం 123 పురపాలికల్లో 8,195 పోలింగ్స్టేషన్లు ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. వార్డులు, ఓటర్లవారీగా మొత్తం కేంద్రాలను గుర్తించినట్టు ఎస్ఈసీ తెలిపింది.
జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పాలకవర్గాలకు ఫిబ్రవరి వరకు సమయం ఉన్నందున వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాను ఎస్ఈసీ ప్రకటించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ బిల్లు తీసుకొచ్చారు. అయితే, గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉన్నందున తాజా జాబితాలో నల్లగొండను మున్సిపాలిటీగానే పరిగణించారు. జగిత్యాల మున్సిపాలిటీని అత్యధికంగా 50 వార్డులుగా, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ను 10, వడ్డెపల్లి 10, మహబూబ్‌నగర్ జిల్లా బోధ్పూర్ 10, నల్లగొండ జిల్లా చండూరు 10, వనపర్తి జిల్లా అమరచింత 10, ఆత్మకూర్ 10 వార్డులుగా విభజించారు.