హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్తుకు గరిష్ఠంగా 17వేల మెగావాట్ల డిమాండ్ వచ్చి నా ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలమని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్తు రంగం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని అన్నారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం విద్యుత్తు సౌధలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ)ని నిక్కచ్చిగా అమలు చేస్తున్న టాప్-3 కేంద్రాలలో తెలంగాణ ఎస్ఎల్డీసీ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థలను బలోపేతానికి రూ.40,017 కోట్ల ను వెచ్చించామని చెప్పారు. కార్యక్రమంలో జేఎండీ సీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు జీ నర్సింగరావు, జగత్‌రెడ్డి, సూర్యప్రకాష్, బీ నర్సింగరావు, జెన్కో డైరెక్టర్లు ఎస్ అశోక్‌కుమార్, బీ లక్ష్మయ్య, అజయ్ పాల్గొన్నారు.