జనగామ : పట్టుదలతో చదవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పటి వరకు విశ్రమించొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రూప్స్ కోచింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు.
ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నాం.
పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పాలకుర్తి కేంద్రాలుగా టెట్, గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలకు ఇచ్చిన శిక్షణ వల్ల అనేక మంది ఉద్యోగాలు సాధించారని మంత్రి తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని మంత్రి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.