హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కొందరు బీజేపీ నేతల వ్యవహారశైలి ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు రాజకీయంగా అధికారపక్షమైన కాంగ్రెస్‌తో పోరాడాల్సి ఉం టుంది. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు బీఆర్ఎస్ మీద తరుచూ విమర్శలు చేస్తుండటంపై బీజేపీ సీనియర్ నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ కూడా కాంగ్రెస్‌ను వదిలిపెట్టి బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారని, ఇప్పటికైనా కాంగ్రెస్‌తో కొట్లాడాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. స్వయంగా మోదీ ఆదేశించినా పార్టీలోని కొందరు నేతలు ఏమాత్రం మారకపోవడంపై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన ఘటనలనే ఉదాహరణగా చూపుతున్నారు.
కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన తర్వాత కాంగ్రెస్ నేతల కన్నా ముందే బీజేపీ నేతలు స్పందించారని చెప్తున్నారు. రేవంత్ అనుకూల మీడియాకు ఫోన్-ఇన్లు ఇస్తూ కేటీఆర్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని అంటున్నారు. వాస్తవానికి, ఫార్ములా- ఈ రేసు కేవలం రాజకీయ కక్షలో భాగంగా పెట్టిందని, ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధమని, బీజేపీ నేతలు ఎందుకు అత్యుత్సాహంతో మధ్యలో దూరుతున్నారో తెలియడం లేదంటూ సీనియర్లు తల లు పట్టుకుంటున్నారు.
ఇలాంటి అం శాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తుంటారని, పార్టీ పాలసీ ప్రకారం మాట్లాడుతారని చెప్తున్నారు. కానీ, బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు ఎందుకు కేటీఆర్ పిటిషన్‌పై మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.