రాచగొండ గుట్టల్లో అనకొండలు భూములు మింగుతున్నాయి. దశాబ్దాల క్రితమే అమ్ముడైన భూములను మళ్లీ మళ్లీ విక్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారులూ చేతులు కలపడంతో దళారుల పంట పండుతున్నది. 60 లక్షలకు పైగా ధర పలుకుతున్న భూములను అప్పనంగా 10-20 లక్షలకే అమ్ముతామని ఎర వేస్తున్నారు. ఈసీలు చూడకుండానే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో రియల్ఎస్టేట్ సంస్థలతోపాటు మధ్యతరగతి ప్రజలూ బాధితులుగా మిగులుతున్నారు.
Rachakonda | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: రాచకొండ గుట్టల్లో భూ మాయ కొనసాగుతున్నది. దశాబ్దాల కిందటే అమ్ముడుపోయిన భూములకు మళ్లీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మ్యుటేషన్ కాకపోవడాన్ని ఆసరాగా చేసుకొని రియల్ దళారులు కొండలు, గుట్టల్లో కాసుల పంట పండించుకుంటున్నారు. గతంలోనే విక్రయించిన భూముల కదా.. అని పట్టాదారులు సైతం తక్కువ ధరకు అంగీకరిస్తుండటంతో రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎకరా కనీసంగా రూ.50-60 లక్షల ధర పలికే భూములు రూ.10-20 లక్షలలోపే వస్తుండటంతో కొన్ని రియల్ సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి.
తక్కువ వస్తున్నాయంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇవి గతంలోనే రిజిస్ట్రేషన్ అయ్యాయనే వాస్తవాన్ని మాత్రం దళారులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో మున్ముందు ఈ భూములన్నీ వివాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో ముందుగానే అరికట్టాల్సిన రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇదే అదనుగా కాసుల పండుగ చేసుకుంటున్నది.సుమారు మూడు దశాబ్దాల కిందట ఆకుల రాజయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్దఎత్తున రాచకొండ పరిధిలో భూములను కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని లోయపల్లి, బోడకొండ, ఎల్లమ్మతండా, బుగ్గతండా, ఆరుట్ల, బండాలేమూర్, చెన్నారెడ్డిగూడ, ముచ్చర్లకుంట తండా, దాత్పల్లి, చీదేడు, పటేల్చెర్వుతండా, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో కొండలు, గుట్టలు ఉన్న భూముల్ని వేల ఎకరాల్లో కొనుగోలు చేయటం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ భూములను ఆయన పలు సంస్థలకు విక్రయించారు.
వాస్తవానికి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించకుండానే కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ (సేల్ డీడ్) ఆధారంగానే ఈ విక్రయాలు జరిపారు. దీంతో డాక్యుమెంట్ల ప్రకారం ఆ భూములు పలు బడా సంస్థల పేరిట ఉన్నప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పాత పట్టాదారుల పేర్లు కొనసాగుతున్నాయి. ఈ భూములను కొనుగోలు చేసిన పలు సంస్థలు వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోట్ల రుణాలు తీసుకున్న అంశం కూడా అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అనంతరం జరిగిన పరిణామాల దరిమిలా కొన్ని సంస్థల భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసుకున్నది. ఆపై వాటిలో కొన్నింటిని కొన్నేండ్ల కిందట రిలీజ్ చేసింది.
రాచకొండ ప్రాంతమనేది నగరానికి సమీపంలోనే ఉన్నది. తెలంగాణలో మారుమూల ప్రాంతంలోనే ఎకరా భూమి ధర కనీసంగా రూ.20-30 లక్షల వరకు ఉన్నదంటే ఈ భూముల ధరలు ఇప్పుడు కనీసంగా రూ.50-60 లక్షలకుపైగా ధర పలుకుతున్నాయి. గతంలో కొనుగోలు చేసిన సంస్థలు మ్యుటేషన్ చేయించుకోకపోవటంతో రెవెన్యూ రికార్డుల్లో ఆయా సంస్థల పేర్లు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగటంతో పాత పట్టాదారుల పేరు మీదే పాసు పుస్తకాలు వచ్చాయి. ఆ సమయంలోనైనా కనీసం సదరు సంస్థలు ముందుకొచ్చి మ్యుటేషన్‌కు ప్రయత్నించలేదు. దీంతో రైతుల పేరిటే రెవెన్యూ రికార్డుల్లో భూములు కొనసాగుతున్నాయి.
గత కొన్నేండ్లుగా ఈ భూములకు డిమాండ్ పెరగటంతో రియల్ బ్రోకర్లు పెద్దఎత్తున ఈ భూములపై కన్నేసి, హైదరాబాద్‌కు చెందిన పలు రియల్ వ్యాపారులు, సంస్థలను సంప్రదిస్తున్నారు. తక్కువ ధరకే భూములు లభిస్తున్నాయంటూ రైతుల నుంచి రూ.10-15 లక్షలకే కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా గతంలోనే విక్రయించిన భూములు.. మళ్లీ మరో అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో విక్రయానికి అంగీకరిస్తున్నారు.
ఈ భూముల విక్రయం గతంలోనే జరిగినప్పటికీ ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో పాత రైతుల పేర్లు ఉండటంతో డబుల్ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఏర్పడింది. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా తాజా పాస్ పుస్తకాలు, ఆన్‌లైన్‌ను ప్రామాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంలోనే ఈ భూములపై వివాదాలు నెలకొనటం, చాలా భూములపై బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్న దాఖలాలు ఉన్న దరిమిలా అధికారులు అప్రమత్తమై.. ఈసీలు (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్) పరిశీలిస్తే సులువుగా గతంలోనే విక్రయం జరిగినట్టు తేలుతుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే అధికారులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచాల మండల పరిధిలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోనూ భూముల డబుల్ విక్రయాలు జరిగినట్టు తెలిసింది.
మంచాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే ఇష్టారాజ్యం నడుస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం నడుచుకుంటూ.. డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒక మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు మంచాల తహసీల్దార్ కార్యాలయంలోని అవుట్సోర్సింగ్ ఆపరేటర్లు ఎలాంటి విచారణ లేకుండా.. ఆర్ఐ, తహసీల్దార్‌కు తెలియకుండానే డిజిటల్ సంతకంతో ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. ఈ కుంభకోణం కొన్ని రోజుల కిందటే బయటపడింది. తాజాగా ఇదే కార్యాలయంలో డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం జరుగుతుండటం గమనార్హం. ఈ అంశంపై మంచాల తహసీల్దార్ కేవీవీ ప్రసాదరావును ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.