హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని పారదోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో మరిన్ని వృక్షాలను రీ-లొకేట్ చేస్తామని వెల్లడించారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన 20 వృక్షాలను ‘వట ఫౌండేషన్’ సాంకేతిక సహకారంతో సినీదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫాంహౌస్‌లో, మరో 15 చెట్లను వివిధ చోట్ల నాటారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. అడగ్గానే ఫాంహౌజ్‌లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించినందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడటంలోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్ చూపిస్తున్న అమితమైన చొరవపై ప్రకృతి ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ, వట ఫౌండేషన్ ప్రతినిధులు ఉదయ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.
కొండగట్టు అటవీక్షేత్రానికి మహర్దశ
మల్యాల, జూలై 14: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధి చుట్టూ అటవీప్రాంతానికి మహర్దశ పట్టనున్నది. 1095 ఎకరాల అటవీ ప్రాంతాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ దత్తత తీసుకున్నారు. హరితహారంలో భాగంగా గతంలో కీసరగుట్ట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఆయన, గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టిన నేపథ్యంలో ఎంపీ సంతోష్ సైతం ఆలయం చుట్టూ అటవీప్రాంత భూములను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దాదాపు 1095 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఏడు 1.04 కోట్ల గ్రీన్ఫండ్ను సంతోష్‌కుమార్ కేటాయించారు. శనివారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటే ప్రాంతాన్ని శుక్రవారం ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ దేశ, విదేశాల్లో విస్తరించిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యావరణానికి ఎంపీ సంతోష్‌కుమార్ చేస్తున్న కృషి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు సంక్షేమం, అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెడతారని, సంతోష్‌కుమార్ మాత్రం వాటితోపాటు సామాజిక బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నాని తెలిపారు. జాన్ కెర్రీ (మాజీ రాష్ట్రపతి అభ్యర్థి) వాతావరణ మార్పు కోసం యూఎస్ ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధిగా నియమించబడ్డారని, అంటే పర్యావరణ పరిరక్షణ ఎంత గొప్పదో అర్థమవుతుందని తెలిపారు. హరితహారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో చోటు లభించడం హర్షణీయమని కొనియాడారు.