అయిజ, మార్చి 8 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్‌స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ప్రధాన కాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈనెల 5న కర్ణాటకలోని గుండ్లకేరీ వద్ద ఎల్ఎల్సీ కెనాల్ ఎస్కేప్‌ల నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆర్డీఎస్కు ఈ నీరు చేరే అవకాశం ఉన్నదని ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సకాలంలో నీళ్లు చేరకపోతే ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే తుంగభద్ర డ్యాంలోనూ నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల సాగు, తాగునీటి అవసరాలకు డ్యాం ద్వారా నీటిని వదులుతుండగా.. నీటిమట్టం తగ్గింది. వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉన్నదని టీబీ బోర్డు అధికారులు తెలిపారు.
భూత్పూర్ కాల్వలో తేలిన మోటర్లు
నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలో భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతో కాల్వలో తేలుతున్న మోటర్లు. నీళ్లు లేకపోవడంతో ఈ రిజర్వాయర్ పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. అప్పు తెచ్చి పంట సాగు చేశామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.