VAHAN Service | హైదరాబాద్, మార్చి 5 (నమస్తేతెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్ సేవ లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక మీదట రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ రోజు వెళితే సరిపోతుంది. ఈ విధానాన్ని తొలుత తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అమలు చేస్తున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
‘వాహన్’ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి చేసుకోవచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.‘సారథి’ పోర్టల్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్లైన్లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు.
తుకుగా మార్చాలనుకున్న వాహనం వివరాలను వాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్ర రవాణాశాఖ పేరొంది. ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం వాహనాన్ని తుకుకు ఇచ్చిన యజమాని కొత్త వాహనం కొనుగోలు సమయంలో ప్రోత్సాహకాలు, రాయితీలు పొందాలంటే పాత వాహనాన్ని తుకుకు సమర్పించినట్లు నిరూపించే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌ను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ రెండేండ్లు చెల్లుబాటు అవుతుంది.