హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలం పాటలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా మొత్తం ఏడు రాష్ట్రాలు రూ.7,900 కోట్లకు ఇండెంట్లు సమర్పించాయి. ఇందులో 12 ఏండ్ల కాలపరిమితితో తెలంగాణకు రూ.1,000 కోట్ల రుణం లభించింది. ఇటీవల ఆర్బీఐ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల రుణం తీసుకొన్నది. జీఎస్డీపీ విలువ ప్రకారం నెలకు సుమారు రూ.4 వేల కోట్లు రుణం తీసుకొనే అవకాశం రాష్ర్టానికి ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.