రోడ్ల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మెటల్ రోడ్లపై దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశలవారీగా వాటన్నింటినీ బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో ప్రాధాన్యాన్ని బట్టి ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) ఆధ్వర్యంలో 27,737.21 కిలోమీటర్ల పొడవున అన్నిరకాల రోడ్లు ఉన్నాయి. 316.72 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 903.48 కిలోమీటర మేర మట్టి రోడ్లు ఉన్నాయి. బ్లాక్‌టాప్ రోడ్లు 25,634.65 కిలోమీటర్లు (92.4శాతం), సీసీ రోడ్లు 882.36 కిలోమీటర్ల (3.2శాతం) మేర ఉన్నాయి. మెటల్, మట్టి రోడ్లు మండలాలు, గ్రామాలను కలిపేవే అధికంగా ఉండగా, బీటీ, సీసీ రోడ్లతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువగానే ఉన్నాయి. మొత్తం రోడ్లలో మెటల్ రోడ్లు 1.1 శాతం ఉండగా, మట్టి రోడ్లు 3.3శాతంగా ఉన్నాయి.
ఈ జిల్లాల్లోనే మెటల్, మట్టి రోడ్లు అధికం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీమ్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో మెటల్, మట్టి రోడ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రణాళిక ప్రకారం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల అభివృద్ధి విశేషంగా జరిగింది. దశలవారీగా మెటల్, మట్టి రోడ్లను కూడా ప్రాధాన్యత ప్రకారం బీటీ, సీసీ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిశ్చయించింది.
ఈ రోడ్లకే తొలి ప్రాధాన్యం
జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న మండలాలు, గ్రామాల్లో తొలి ప్రాధాన్యంగా పనులు చేపట్టాలని, అనంతరం దూరప్రాంతాల్లో అంతగా ప్రాధాన్యం లేని రోడ్లపై దృష్టి కేంద్రీకరించాలని ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లా కేంద్రాలకు సమీప మండలాల్లో వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారా ఇండ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకూ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. దీంతో ఆయా రోడ్లను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..
మండలాల్లోని రోడ్లను కూడా జిల్లా కేంద్రాల్లోని రోడ్ల మాదిరిగానే అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెటల్, మట్టి రోడ్లపై దృష్టి సారించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రానున్న కొంతకాలంలోనే ఆర్అండ్బీ పరిధిలో మెటల్, మట్టి రోడ్లను పూర్తిగా బీటీ రోడ్లుగా మార్చేస్తామని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.