మేడ్చల్, జూన్ 18 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లోని 275.12 ఎకరాల భూ దందా రెవెన్యూ అధికారుల మెడ మీద కత్తిలా తయారైందా? తమ పని కానిచ్చేందుకు సర్కార్ పెద్దలు చేసిన ఒత్తిడి అధికారులను ఊపిరి సలుపనీయడం లేదా?.. ఏం జరిగినా మేమున్నాం.. అంటూ తెర వెనుక చెప్పిన ప్రభుత్వ పెద్దలు తీరా… భూ దందా గుట్టు రట్టయినప్పటి నుంచి నోరు మెదపడం లేదనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతున్నదా? పెద్దలు ఆదుకోకుంటే ఎలా అనే భయం వారిని వెంటాడుతున్నదా?.. ప్రస్తుతం మేడ్చల్ తహసీల్దార్ నిరంతరంగా సెలవులు పెట్టడం చూస్తుంటే నిజమేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆర్డీవోకు పోస్టింగ్ ఇచ్చి ఈ తతంగం నడిపి, ఎంతో సర్వీసు ఉన్న తహసీల్దార్ సెలవులో ఉన్నప్పటికీ పిలిపించి నివేదిక ఇప్పించడంతో.. ఆ ఒత్తిడి భరించలేకే సెలవుల మంత్రాన్ని జపిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
ఈ క్రమంలో తహసీల్ కార్యాలయంలో ఎవరిని కదిలించినా రావల్కోల్ ముచ్చటనే ముందుకు వస్తున్నది. మేడ్చల్ మండలం రావల్కోల్ సర్వే నంబర్లు 4 నుంచి 18 వరకు, 20, 22, 25లలో ఉన్న 275.12 ఎకరాల ఇనామ్ భూమిపై కొన్నేండ్లుగా కొనసాగుతున్న ఓఆర్సీల జారీ ప్రక్రియను కేవలం 3 నెలల వ్యవధిలో తేల్చడం..దాని వెనుక సర్కార్ పెద్దలు ఉండటంతో ఈ భూ దందా ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. అడుగడుగునా ఉల్లంఘనలతో ఆర్డీవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఎంతమేరకు న్యాయపరంగా నిలబడుతాయనే దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. తర్వాత కథ ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి ఆ భూముల్ని చేజిక్కించుకొని నిర్మాణ కంపెనీల చేతుల్లో పెట్టి కోట్లు దండుకొని బయటపడుదామనేది పెద్దల వ్యూహం. అయితే గతంలో ఉన్న ఆర్డీవో తాను ఈ అవినీతి వ్యవహారం చేయలేనని మొండికేయడంతో, ఈ స్థానంలో మరో మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆర్డీవో ద్వారా ఓఆర్సీ ప్రొసీడింగ్స్ ఇవ్వడమే ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని బయటపెట్టింది.
కాగా ఈ వ్యవహారంలో కీలకమైన మేడ్చల్ తహసీల్దార్ నివేదికపైనా తెర వెనుక పెద్దలు భారీస్థాయిలో ఒత్తిడి పెట్టారని తెలిసింది. తహసీల్దార్ భూపాల్ తాను నివేదిక ఇవ్వలేనని సెలవుపై వెళ్లగా, అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి చివరికి నివేదిక ఇచ్చే సమయంలో ఒకట్రెండు రోజులు మాత్రమే కార్యాలయానికి వచ్చినట్టు ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా కీసర ఆర్డీవో ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేసిన రోజు నుంచి నిరంతరంగా సెలవులపై వెళ్తున్నట్టు తెలిసింది. ఈ 15 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 12వ తేదీన ఒకమారు రాగా ఆ తర్వాత బుధవారం వచ్చారు. గురువారం మళ్లీ రాలేదు. మరో 10 రోజులు సెలవులోనే ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. కాగా తహసీల్దార్ సెలవులో ఉండటంతో మేడ్చల్ రెవెన్యూ శాఖలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడున్న డిప్యూటీ తహసీల్దార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ పనులు మాత్రం కావడం లేదు. తహసీల్దార్ మూడు రోజుల పాటు కార్యాలయానికి వచ్చినా ఒక ఫైల్ కూడా క్లియర్ చేయలేదని తెలుస్తున్నది.