సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో రోడ్లు పరిస్థితి దారుణంగా తయారైంది. చినుకు పడితే చాలు రోడ్లు(Roads) జలమయమవుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఆవాస గ్రామం చోవులతండాలో వినూత్న రీతిలో నిరసన(Innovative protest) తెలిపారు. తమ తండాకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గిరిజన బిడ్డలు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ సోమవారం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు బురదతో చిత్తడిగా మారుతుందన్నారు. దీంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే వాహనాలు సైతం బురదలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి గిరిజన తండాకు సీసీ రోడ్డు సౌకర్యము కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.