కొందుర్గు, ఏప్రిల్ 1: ఎలుకలు దాడి చేసి పలువురు విద్యార్థినులను గాయపరిచాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని రామచంద్రాపురం పులుసుమామిడి వద్దగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థినులు రాత్రి నిద్రకు ఉపక్రమించిన తర్వాత దాడి చేశాయి. ఈ క్రమంలో భాగ్యశ్రీ, స్వప్న, మనోజ్ఞ, కళ్యాణి, అర్చన, మాధురి, మల్లేశ్వరి, చందన, శ్రావణి గాయపడ్డారు.
ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు దవాఖాన తీసుకెళ్లగా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి చికిత్స చేసినట్టు సమాచారం. కేజీబీవీ ఎస్వో సకీనానిస్సీని వివరణ కోరగా ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు భక్షాలు తీసుకొచ్చారని తెలిపారు. తాము విద్యార్థినుల వద్ద తనిఖీ చేయగా, కొందరు దాచి పెట్టుకోవడంతో తియ్యటి పదార్థాలకోసం వచ్చిన ఎలుకలు విద్యార్థినులను గాయపరిచినట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా టీటీ ఇంజక్షన్లు వేయించినట్టు తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం బాగానే ఉన్నదని పేర్కొన్నారు.