హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫరాల శాఖకు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు.
అలాగే, అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపించే బియ్యం స్టాక్‌ను దించుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయిలు రూ. 100 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రతినెల సొంత ఖర్చులతో బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదని, తమకు రావాల్సిన కమీషన్ రాకపోవడంతో అద్దె, కూలీలు, హమాలీ, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది ఉందని వాపోతున్నారు.
రేషన్ డీలర్ల కమీషన్‌కు సంబంధించిన నిధులను కేంద్రం విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులను విడుదల చేయలేదని తెలిసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 75 కోట్లు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ. 25 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు రేషన్ డీలర్లు తెలిపారు. రూ. 75 కోట్లలో కేంద్రం తన వాటా కింద రూ. రూ. 37.5 కోట్లను విడుదల చేసినట్టు తెలిసింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 37.5 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ చేస్తేనే మొత్తం నిధులు విడుదలవుతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో మొత్తం పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రేషన్ డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా రు. ప్రభుత్వం వద్ద రూ. 37.5 కోట్లు కూడా లేవా అని నిలదీస్తున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అటకెక్కించిందని మండిపడుతున్నారు. గౌరవ వేతనం రూ. 5 వేలు, కమీషన్‌ను రూ. 300 పెంచుతామనే హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.