హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. కమీషన్ బకాయిల కోసం కాంగ్రెస్ సర్కారుకు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేయబోమని తేల్చి చెప్పారు. బియ్యం పంపిణీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రేషన్ డీలర్లు పౌరసరఫరాల భవన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాల బంద్ ప్రకటన చేశారు. దీంతోపాటు ఆందోళనకు సంబంధించి కార్యాచరణను వెల్లడించారు. సర్కారు మొండికేస్తే వచ్చే నెల 4వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు, సివిల్సప్లయ్ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు ఇచ్చారు.
రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీకి సంబంధించిన ఐదు నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వారికి కమీషన్ చెల్లించలేదు. జూన్లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కమీషన్ చెల్లించలేదు. ఇక అంతకు ముందు ఏప్రిల్, మే నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల సుమారు రూ. 25 కోట్ల చొప్పున ఐదు నెలలకు గాను రూ. 125 కోట్ల కమీషన్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.