Maheshwaram | బడంగ్‌పేట, ఆగస్టు 5: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొటోకాల్ పాటించాలని కోరినందుకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడుగుద్దులు గుద్దారు. దీంతో ఒక బీఆర్ఎస్ నాయకుడు స్పృహతప్పి పడిపోగా, పలువురికి గాయాలయ్యాయి. బాలాపూర్ మండల పరిధిలోని ఏవైఆర్ గార్డెన్లో మంగళవారం రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, పట్నం మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కే చంద్రారెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ ఇందిరాదేవి తదితరులు హాజరయ్యా రు. అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానితులు మాత్రమే వేదికపై కూర్చోవాలి.
కానీ, అధికారులు ఆహ్వానించకపోయినా, కొందరు కాంగ్రెస్ నాయకులు వేదికపై ఉన్న కుర్చీలన్నింటిని ఆక్రమించారు. ఫలితంగా అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు అరగంటకుపైగా నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేదిక కింద ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించాలని నినాదాలు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని ప్రొటోకాల్ పాటిస్తామని చెప్పారు. అయినా కాంగ్రెస్ నాయకులు ఎవరూ వేదిక దిగలేదు. దీంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కలుగజేసుకుంటూ అధికారిక కార్యక్రమం అయితేనే సభలో ఉంటామని, గాంధీభవన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తామంటే సభలో ఉండలేమని స్పష్టంచేశారు.
సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ కాంగ్రెస్ నాయకుడు సబితారెడ్డి వైపు వేలు చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో బెదిరించే ప్రయత్నం చేస్తే వేలు తీసేస్తానంటూ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తోపులాట మొదలైంది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో, సభను బహిష్కరిస్తామంటూ వేదిక దిగి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ముందుగానే మోహరించిన పోలీసులు ఒక్కరిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను పిడిగుద్దులు గుద్దారు. బీఆర్ఎస్ నేత ఎంఏ సమీర్ స్పృహ తప్పి పడిపోయారు. పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. చివరకు మహిళలను, కవరేజీ చేస్తున్న మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలలేదు. ఈడ్చి పడేశారు. కెమెరాలు లాక్కున్నారు. వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు.
కాంగ్రెస్ ప్రజా పాలనలో పోలీస్‌ల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గానికి కేవలం 1,754 రేషన్‌కార్డులు మంజూరు చేసి, కాంగ్రెస్ నాయకులు ఇంత హంగామా చేయడం ఏమిటంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ వాణీదేవిని సైతం పోలీసులు నెట్టేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల ఓవరాక్షన్ చూస్తున్నామని, తప్పనిసరిగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. పేదలకు రేషన్‌కార్డులు అందాలన్న ఉద్దేశంతోనే తాము బయటకు వచ్చామని, లేదంటే కార్యక్రమం నడిచేది కాదని స్పష్టంచేశారు.