భద్రాచలం : రథసప్తమి(Rathasaptami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి (Seetharamachandra Swamy) వారిని బంగారు కవచాలతో అలంకరించారు. రథసప్తమిని పురస్కరించుకుని అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారి మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరు వీధుల్లో అర్చకులు ఉరేగిస్తారు. ఇదిలా ఉండగా రథసప్తమి పురస్కరించుకొని అనేక పురాణ గాథలు ఉన్నట్లు పలువురు పండితులు చెప్తున్నారు.
నిజానికి సూర్యుడే మనకు కనిపించే దేవుడు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలని చెబుతారు.