యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో రథ సప్తమి(Rath Saptami) వేడుకలు వైభవోపేతంగా సాగాయి. ఆదివారం ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఆరుణపారాయణాలు పఠిస్తూ సేవను ఊరేగించారు. తూర్పు రాజగోపురం వద్ద సేవను వేంచేపు చేసి స్వామివారి వైభనం, పుట్టు పుర్వోత్తరాలు, అలయ చరిత్రను ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు వ్యాఖ్యానించారు.
సాయంత్రం స్వర్ణరథంపై స్వామివారి వేంచేపు చేసి సేవను కొనసాగించనున్నారు. సకలరోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రధాత అయిన సూర్యని వాహనాన్ని స్వామివారు అధిరోహించి భక్తులకు కటాక్షించారు. భక్తులు తిరుమాఢ వీధుల్లోకి చేరుకుని స్వామివారిని మంగళహారతులు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.