చౌటకూర్, జూలై 9: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్‌లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం పల్లి చట్నీ పాత్రలో ఎలుక సంచరించడాన్ని అక్కడున్నవారు వీడియో తీశారు. మంగళవారం ఉదయమే ఈ వీడియోను పలు సోషల్‌మీడియా గ్రూపుల్లోకి షేర్ చేయగా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ అధికారుల బృందంతోపాటు సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి హుటాహుటినా కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు.
సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు వేర్వేరుగా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సీఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారుల బృందం కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెస్ కాంట్రాక్టర్‌ను తొలిగిస్తున్నట్టు అక్కడే ప్రకటించారు. తమకు అధ్వానమైన భోజనాన్ని అందిస్తున్నారంటూ జేఎన్టీయూ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మెస్‌లు శుభ్రంగా లేనందున ఎలుకలు, బల్లులు, ఈగలు సంచరిస్తున్నాయని విద్యార్థులు గగ్గోలు పెట్టారు.
ఎలుక సంచారంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశా రు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ ని చెప్పారు. పునరావృతం కాకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.