హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని నిరుడు వరదల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్) కొత్తగా అభివృద్ధి చేసిన పూస శనగ-4037 రకానికి అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. సోమవారం ఢిల్లీలో ఈ కొత్త వంగడాన్ని విడుదల చేశారు. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడినిచ్చే కొత్త శనగ రకానికి ఐసీఏఆర్ అశ్విని పేరు పెట్టడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అశ్విని పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఛత్తీస్గఢ్ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు.