Sircilla | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : సాగునీటి వనరులు, ఇసుక రీచ్లు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఖనిజ సంపదకు కేంద్ర బిందువు కానున్నది. తాజాగా ఈ సంపద వెలుగు చూడటంతో రాష్ట్ర గనుల శాఖ మరింత పరిశోధన దిశగా అడుగులు వేస్తున్నది. కొత్తగా వేస్తున్న కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు మార్గం తవ్వకాల్లో ఈ ఖనిజ సంపద బయటకు రావడంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయం లో కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, ధార్మిక క్షేత్రమైన వేములవాడ ప్రజల కోరిక మేరకు కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తి కావడంతో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు.
అందులో అత్యంత అరుదైన ఖనిజ సంపద ఉన్నట్టు గుర్తించిన అధికారులు లోతైన పరిశోధన మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఖనిజ సంపద ఉన్నట్టు గుర్తించిన గనుల శాఖ కేంద్రానికి నివేదికలు పంపించినట్టు తెలిసింది. సిరిసిల్ల జిల్లాలో ఈ ఖనిజ సంపద 562.47 చదరపు కిలోమీటర్లు ఉండగా, సిద్దిపేట జిల్లాలో మరికొంత భాగం ఉన్నట్టు గనుల శాఖ అధికారులు తెలిపారు. అందులో 15 రకాల లాంథనైడ్స్ ఉండగా, స్కాండియం, వైట్రియం ఖనిజాలు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కిలో రూ.32 వేలకుపైగా విలువ చేసే వైట్రియం ప్రధానమైనది కావడంతో మరింతగా పరిశోధనలు చేసేందుకు గనుల శాఖ సన్నద్ధమవుతున్నది. సిద్దిపేట జిల్లా విఠలాపురం, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పెద్దలింగాపూర్, బస్వాపూర్, లక్ష్మీపూర్ గుట్టల్లోనూ పరిశోధనలు చేస్తే ఇంకా అరుదైన ఖనిజ సంపద బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.