హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): ఈనెల 13 నుంచి 16 వరకు దుబాయ్‌లో నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్.. సమ్మిట్‌లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీనార్కోటిక్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుని అవార్డు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలతోపాటు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, గత మూడేండ్లలో సాధించిన విజయాలకు ఈ అవార్డు దక్కినట్టు తెలిపారు. సమ్మిట్‌లో 138దేశాల నుంచి అధికారులు పాల్గొన్నారని, వారితో పోటీపడి ఈ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. అవార్డు సాధనలో తన బృందం సభ్యుల కృషి, అంకితభావం కీలకమని చెప్పారు.