హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై పన్నుల భారాన్ని అడ్డగోలుగా పెంచుతూ కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల లబ్ధి చేకూర్చుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల సబ్సిడీలు ఇచ్చినా ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగలేదన్నారు. కార్పొరేట్లపై చూపినంత ప్రేమను సామాన్య ప్రజలపై చూపేందుకు కేంద్రానికి మనసురావడంలేదని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. గత 16 నెలల్లో దేశ నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో పెరిగి డిసెంబర్లో 8.3 శాతానికి చేరినట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఆనంద భాస్కర్ తన ట్వీట్‌కు జత చేశారు.