Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తేతెలంగాణ): మిట్ట మధ్యా హ్నం.. ఎర్రటి ఎండలో పెట్రోల్ అయిపోవడంతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నెట్టుకుంటూ వస్తుంటే.. అయ్యో అని జాలిపడతాం. వీలుంటే కొంత పెట్రోల్ ఇచ్చి సాయం చేస్తాం. లేదంటే కాలు పెట్టి కాస్త బంక్ దాకా తోడ్పాటు అందిస్తాం. కానీ, ఓ వ్యక్తి మానవత్వం మరిచి ప్రవర్తించా డు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మధ్యాహ్నం కూకట్‌పల్లిలో ఒక వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు.
ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా కొంతదూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయింది. ర్యాపిడో రైడర్ బైక్ దిగి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావాల్సిందిగా కస్టమర్‌ను విజ్ఞప్తి చేశాడు. అందుకు కస్టమర్ ససేమిరా అని, అలాగే బైక్‌పై కూర్చుండిపోయాడు. గత్యంతరం లేక పొట్టకూటి కూసం ఆ ర్యాపిడో రైడర్ సదరు వ్యక్తిని బైక్‌పై కూర్చోబెట్టుకుని ఎండలో అలాగే నెట్టుకుంటూ పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్లాడు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియోతీసి సోషల్‌మీడియా లో పోస్టు చేయడంతో అది వైరలైంది. పలువురు నెటిజన్లు కమస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.