Rangareddy | రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు. రాత్రి హత్య జరిగిందని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రెండు ప్రాంతాల్లో్ హత్యలు జరిగాయని పేర్కొన్నారు. మొదట షాబాద్‌లోని బాధితురాలి ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు రాజ్ కుమార్ వెళ్లాడని.. అక్కడ బాధితురాలి తల్లిని, నానమ్మను హత్య చేశాడని చెప్పారు.
ఆ తర్వాత బాలికను నగర్‌కుంట దగ్గరకు తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలను చంపేశాడని పేర్కొన్నారు. అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు కాల్ చేసి ఆరుగురిని చంపేశానని.. తాను కూడా చనిపోతున్నానని తెలిపాడన్నారు. తమకు సమాచారం రావడంతో ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. రాజ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతని కోసం ఏడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. భార్యాపిల్లలను కూడా రాజ్‌కుమార్ చంపడం తమను ఆశ్యర్యానికి గురి చేసిందని అన్నారు.
దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌పై మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక (17)ను వేధించాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 26వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే శుక్రవారం అతను జైలుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. షాబాద్ పీఆర్ఆర్ స్టేడియం సమీపంలోని మైనర్ బాలిక (17) ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరినీ కత్తితో పొడి చంపాడు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోని తీసుకెళ్లి పీకకోసి హత్య చేశాడు.
శనివారం తెల్లవారుజామున తన ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్.. కట్టుకున్న భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి అందర్నీ చంపేశానని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్ కుమార్ చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.