శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 13:03:19

ఆయకట్టు చివరి రైతుకూ నీరందాలి: హరీష్‌ రావు

ఆయకట్టు చివరి రైతుకూ నీరందాలి: హరీష్‌ రావు

సిద్దిపేట: రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలైన నీటి వినియోగంపై నీటిపారుదల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహించారు. కాల్వల్లో నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన కుడి, ఎడమ కాలువల తూములకు వెంటనే గేట్లు బిగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలపై లైనింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. మైనర్‌, సబ్‌మైనర్‌ కాల్వలకు నీరందించేలా మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు కృషి చేయాలని సూచించారు. చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతులకు సాగు నీరందేలా ఆయా మండలాల తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని, రైతుల అవసరాలను గుర్తించి నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి ద్వారా నీటిని విడుదల చేస్తే నీటి వృథా తగ్గుతుందని సూచించారు. 

నీటి పొదుపుపై  రైతులకు త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

సిద్దిపేటలోని తన నివాసంలో 140 మంది హైర్‌బస్సు డ్రైవర్ల కుంటుంబాలకు నిత్యావసర సరుకులను హరీష్‌ రావు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆరు వందల వైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.


logo